Site icon HashtagU Telugu

Jagadeesh Vs Kavitha : కవిత జ్ఞానానికి నా జోహార్లు – జగదీష్ రెడ్డి కౌంటర్

Jagadeesh Counter

Jagadeesh Counter

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Kavitha Vs Jagadeesh) మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. కవిత వ్యాఖ్యలపై తాజాగా జగదీష్ రెడ్డి స్పందిస్తూ “నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లె వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు.

“కొంతమంది ఏదో చేసేద్దామని అనుకుంటున్నారు. వ్యక్తులుగా ఏదో చేస్తామనుకుంటే అది వాళ్ళ భ్రమ. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేరు. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచాను. కొంతమంది అది కూడా గెలవలేదు కదా. పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీ గొప్పది. నల్గొండలో అంతకుముందు ఎక్కువ సీట్లు వచ్చాయి… అప్పుడు నేనే కారణం అన్నారు… ఇప్పుడు ఒక్కడినే గెలిచాను… అందుకే దీనికి కూడా నేనే కారణం. బనకచర్ల, కాళేశ్వరంపై కేసీఆర్తో చర్చించాం. కేసీఆర్తో చర్చల్లో కవిత విషయమే ప్రస్తావనకు రాలేదు. కవిత వైఖరి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.

Harley-Davidson: హార్లే-డేవిడ్‌సన్ నుంచి త‌క్కువ ధ‌ర‌కే బైక్‌.. ఎంతంటే?

అంతకుముందు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కవిత సంచలన ఆరోపణలు చేశారు. “లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు. కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు… ఎన్నడూ ప్రజా పోరాటాల్లో పాల్గొనలేదు. అసలు బీఆర్ఎస్‌తో మీకేం సంబంధం? లిల్లీపుట్ నాయకుడు, నిన్న మొన్న వచ్చిన చోటా మోటా నాయకులు కూడా నాపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్‌కు సంబంధం లేని వ్యక్తితో నాపై ఆరోపణలు చేయిస్తున్నారు. వారి వెనుక బీఆర్ఎస్ లో పెద్ద నాయకుడు ఉన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతాను. పార్టీ కూడా సమయం వచ్చినప్పుడు స్పందిస్తుంది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“ఇదే సమయంలో ఒక ఆడ బిడ్డగా నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ, బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా” అంటూ కవిత విమర్శించారు. దీంతో కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా పెను దుమారం రేపాయి. ఈ అంతర్గత వివాదం పార్టీకి ఎలాంటి పరిణామాలను తెచ్చిపెడుతుందో చూడాలి.