Jagadish Reddy : తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఎప్పటికప్పడు తలుచుకుంటూ నడుస్తున్నారని, నరసింహ స్వామిలా ఎప్పుడైనా కేసీఆర్ బయటకు వస్తారేమో అని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను, తెలంగాణ తల్లి రూపు మార్పును తీవ్రంగా ఎండగట్టారు. తాము ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ మాత విగ్రహాన్ని సచివాలయంలో ఉంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు కావాలంటే ఆ విగ్రహాన్ని గాంధీ భవన్‌లో పెట్టుకోవాలని సూచించారు.
అంతేకాకుఆండా.., గతంలో కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వెనుకబడిపోయిందని, కానీ కేసీఆర్ హయాంలో జిల్లా సస్యశ్యామలం అయిందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 7,000 మెగావాట్ల నుంచి 24,000 మెగావాట్లకు పెంచిన ఘనత కేసీఆర్‌దే అని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టును అడ్డుకుంటామని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసి, ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతున్నప్పటికీ ఎలాంటి అడ్డంకులు లేవు కాబట్టి కోమటిరెడ్డికి ఎద్దేవాగా ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు ప్రయోజనం లేదని, కానీ మంత్రుల జేబులు మాత్రం నిండాయని విమర్శించారు. రైతుబంధు, బీమా, రుణమాఫీ వంటి పథకాలలో నల్గొండ జిల్లా తీవ్ర నష్టపోయిందని చెప్పారు. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు కేవలం 12,000 కోట్లు మాత్రమే అయినప్పటికీ, ఎగ్గిత్తినది 30,000 కోట్లు అని వివరించారు. తాము ప్రారంభించిన పథకాలనే కాంగ్రెస్ నేతలు మళ్లీ ప్రారంభిస్తున్నారని, కొత్తగా ఏ పని చేయలేకపోతున్నారని జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పథకాలు పూర్తి చేసే సామర్థ్యం లేదని ధ్వజమెత్తారు. జగదీశ్ రెడ్డి మాటలతో కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు, కేసీఆర్ హయాంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, తాము చేపట్టిన పథకాల పై గర్వభావన స్పష్టమైంది.
Read Also : BRS: కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ చార్జ్‌షీట్.. కేటీఆర్ డుమ్మా..