KTR : బీఆర్ఎస్ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో శంకుస్థాపన జరిగిన అమరరాజా బ్యాటరీ ప్లాంట్ విషయమై ఇటీవలే అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో బ్యాటరీ ప్లాంట్ కోసం ఇచ్చిన హామీలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే తమ ప్లాంట్‌ను వేరే చోటు తరలిస్తామని స్పష్టం చేశారు. దీనిపై తాజాగా ఆదివారం బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ స్పందించారు. అమర రాజా సంస్థ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దని కాంగ్రెస్ సర్కారుకు కేటీఆర్(KTR) సూచించారు. బ్రాండ్ తెలంగాణ ఇమేజ్‌కు నష్టం వాటిల్లకుండా సీఎం చర్యలు చేపట్టాలని కోరారు.
We’re now on WhatsApp. Click to Join
అమర రాజా సంస్థ తెలంగాణ నుంచి వెళ్లిపోతామని చెప్పడం దురదృష్టకరమని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడాయన్నారు. కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్‌కు వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించిందని చెప్పారు. ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లిపోతానని చెబుతుండటం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా అమరరాజా సంస్థను ఒప్పించేందుకు తాము చాలా కష్టపడ్డామని ఆయన గుర్తు చేసుకున్నారు.
Also Read :Money Mool Accounts : దడ పుట్టిస్తున్న ‘మనీ మూల్ అకౌంట్స్’.. బ్యాంకులకు పెనుసవాల్
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంతో రెవెన్యూ సర్ ప్లేస్ స్టేట్‌గా ఉందన్నారు. కానీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే తెలంగాణ దివాలా తీసిందని ప్రచారం చేస్తుండటం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. కంపెనీలకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కారుపై ఉందన్నారు. లేదంటే మరిన్ని సంస్థలు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలే ముప్పు ఉందన్నారు. శనివారం రోజు (ఆగస్టు 10న) మహబూబ్‌నగర్ జిల్లాలో సెల్ మాన్యుఫాక్చరింగ్ కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంటు నిర్మాణానికి భూమి పూజ చేసిన గల్లా జయదేవ్.. 1.5 గిగావాట్ల బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ ఫేజ్-1కు ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాంటు తరలింపు కామెంట్స్ చేశారు.