Site icon HashtagU Telugu

BRS vs BJP : బీఆర్ఎస్ పై ప్రధాని దాడి అంతరార్థం అదేనా?

BRS vs BJP Narendra Modi

Is That The Implication Of Prime Minister's Attack On Brs..

By: డా. ప్రసాదమూర్తి

BRS vs Narendra Modi : ఆడవారి మాటలకు అర్థాలు వేరు అన్నారు కానీ అసలు చెప్పాలంటే ఈ మాట రాజకీయ నాయకులకు వర్తిస్తుంది. వారు మాట్లాడే మాటలు బయటకు చెప్పే అర్థాలు ఒక రకంగా, లోపల మరో రకంగా ఉంటాయి. దీనికి ఉదాహరణలు కావాలంటే ఎన్నికల సందర్భంగా మన నాయకులు మాట్లాడే మాటలు చూపిస్తే సరిపోతుంది. ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తూ, వడివడిగా వేలకోట్ల ప్రాజెక్టులను ప్రకటించి, శంకుస్థాపనలు చేసేస్తున్నారు. సరే, కనీసం ఎన్నికలు దగ్గరపడినప్పుడైనా ఏలిన వారికి ప్రజలు, ప్రజోపయోగ పథకాలూ గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు రాష్ట్రానికి కనీసం దక్కాల్సిందేదో దక్కుతుంది కదా అని ప్రజలు సంబరపడతారు. ఇదంతా సరే గానీ ఈ సందర్భంగా ప్రధాని ఒక్కో రాష్ట్రానికి వెళ్లి ప్రారంభిస్తున్న పథకాలతో పాటు కొన్ని మాటల తూటాలు కూడా వదిలి వెళుతున్నారు. ఇక ఆ తూటాల విస్పోటనతో ఆ రాష్ట్రాలు, పొగలు పొగలుగా కమ్మిన రాజకీయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.

తెలంగాణ (Telangana) వచ్చి రెండు చోట్ల పర్యటించి, కొన్ని పథకాలను ప్రకటించి వెళ్లిన ప్రధాని తెలంగాణ ప్రజల చెవిలో కొన్ని మాటలు కూడా ఊది వెళ్ళిపోయారు. ఇక ఆ మాటలు బీఆర్ఎస్ (BRS) కోటలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బిజెపి నేతల చేతుల్లో మాత్రం ప్రధాని మాటలు కొత్త అస్త్రాలుగా మారిపోయాయి. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తనను కలిసినట్టు, తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని, అలా జరిగితే తన పార్టీని ఎన్డీఏలో భాగస్వామ్యం చేస్తానని అన్నట్టు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో తెలంగాణ ప్రజల సమక్షంలో ప్రకటించడం మామూలు విషయం కాదు. ప్రధాని బహిర్గతం చేసిన ఈ రహస్యపు సమాచారంలో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు. కానీ ప్రధాని అంతటి వ్యక్తి ఇంత బహిరంగంగా అబద్ధం చెప్తారా అని ఎవరైనా తటపటాయించడానికి ఆస్కారం ఉంది. అందుకే ప్రధాని మాటలు తూటాల్లా పేలాయి.

We’re now on WhatsApp. Click to Join.

ప్రధాని చెప్పిన మాటలు అబద్ధాలని, వాస్తవానికి ఐదేళ్ల క్రితం తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, మోడీ తరపున రాయబారిగా తమ దగ్గరకు వచ్చి, తమ పార్టీని ఎన్డీఏ లో భాగస్వామిగా చేయమని కోరారని, తాము ఆ క్షణమే ఆ అభ్యర్థనను తిప్పికొట్టామని కేటీఆర్ చెప్తున్నారు. దీనికి వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ప్రజలకు ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలో.. ఎవరి మాటలు నమ్మకూడదో చాలా అయోమయం కలుగుతుంది. అసలు ఇలాంటి అయోమయాన్ని సృష్టించడమే రాజకీయ నాయకుల మాటల అంతరార్థం. ప్రధాని ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు బయట పెట్టారు. అది జరిగిందా లేదా అనేది ప్రధానం కాదు. ఇక్కడ ప్రధాని చెప్పిన మాటల వెనక మొత్తం బిజెపి వ్యూహం ఏదో ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాలకు, ప్రధాని ఇలా వచ్చి అలా వెళ్ళిన మర్నాడు బిజెపి జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బలాన్నిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇక నిట్టనిలువునా చీలిపోతుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. అది జోస్యం అనేకంటే వారి రాజకీయ ఎత్తుగడలో భాగంగా భావించాలి.

కేసీఆర్ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని, తమ పార్టీని ఎన్డీఏలో భాగస్వామ్యం చేస్తానని అన్న మాటలు ప్రధాని అంతటి వారు చెప్తే ప్రజల మాటేమో గానీ, బీఆర్ఎస్ (BRS) లోనే కొందరు నాయకులు నమ్మే అవకాశం ఉంది. ఎంత బలమైన పార్టీ అయినప్పటికీ ఆ పార్టీలో కుటుంబ పాలన కొనసాగుతుంటే, నాయకులు తండ్రి వైపో, తనయుడివైపో లేదా మరో బలమైన నాయకుడివైపో గ్రూపులుగా చీలి ఉంటారు. ఒకవేళ కేసీఆర్ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్న విషయం నిజమైతే కేటీఆర్ కి దూరంగా మరొక గ్రూపుతోనో, మరొక రాజకీయ నాయకునితోనో అంటిపెట్టుకున్న పార్టీ వ్యక్తులు డైలమాలో పడతారు. కేటీఆర్ పార్టీ పగ్గాలను చేపట్టి రేపు అధికారంలోకి వస్తే, అలాంటి వారిని ఏరివేసే అవకాశం ఉంది. కాబట్టి కేటీఆర్ కు అనుకూలంగా లేని నాయకులు పార్టీలో ఎవరైతే ఉంటారో వారు ముందుగానే జాగ్రత్తపడి, పార్టీ నుండి బయటికి వచ్చేస్తారని, అలా వచ్చినప్పుడు సహజంగానే వారు బిజెపి వైపు నడుస్తారని ప్రధాని మాటల అంతరార్థంగా గ్రహించాల్సి ఉంటుంది. మరి ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చి ప్రజలకు ఇవ్వాల్సిన వరాల మాట అలా ఉంచి, చెప్పాల్సిన మాట ఏదో చెప్పి వెళ్ళిపోతే, వెంటనే బీఆర్ఎస్ పార్టీ నిలువునా చీలిపోతుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యకు అర్థం ఇంకేముంటుంది?

అంతేకాదు, ప్రజలు కూడా కొంచెం గందరగోళంలో పడతారు. ఎంత అనుకున్నా రాష్ట్రం కోసం కొట్లాడి రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్ అంటే కొద్దో గొప్పో భక్తి పారవశ్యంతో ఉన్న ప్రజలు ఇక కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండడని, ఆయన కుటుంబ పాలన కొనసాగుతుందని అర్థం చేసుకున్నాక, వారు తమ మద్దతును మరోవైపు మరలించే అవకాశం లేకపోలేదు. ప్రధాని చెప్పిన మాటలో ఇది మరొక గూఢార్థంగా భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కి మధ్య ఎప్పుడు ఎలాంటి సంభాషణ ఏ సందర్భంగా జరిగిందో తెలియదు గానీ, ఇప్పుడు మోడీ బహిర్గత పరచిన మాటల ప్రభావం రాజకీయంగా అనూహ్యమైనదిగా ఉండొచ్చని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.

ఇదంతా ఇలా ఉంటే, అసలు బీఆర్ఎస్ (BRS), బిజెపి (BJP) రెండూ ఒకటేనని, పైకి వారు ఎంత కొట్టుకున్నట్టు నటిస్తున్నా, లోపల వారి మధ్య విడరాని బంధం ఉందని మరోపక్క రేవంత్ రెడ్డి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. రెండు పార్టీలు ఇలా బయటకు కొట్టుకోవడం వల్ల నిజంగానే ఈ రెండూ రాజకీయంగా తలపడుతున్నాయని భావించి, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు కొద్ది శాతమైనా బిజెపికి ఓటు వేయవచ్చు. అది అనివార్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే. అలా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా కాంగ్రెస్ కు పెద్ద మెజారిటీ రాకుండా బిజెపి అడ్డుకోవచ్చు. ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటును బిజెపి, కాంగ్రెస్ రెండూ పంచుకుంటే, మధ్యలో బీఆర్ఎస్ సునాయాసంగా మూడోసారి పగ్గాలు చేపట్టవచ్చు.

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ పరస్పరం సంఘర్షించుకున్నట్టు కనిపిస్తున్న వాతావరణంలో అదృశ్యంగా ఇలాంటి ఒప్పందం ఒకటి ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రధాని తెలంగాణకు వచ్చి ప్రకటించిన పథకాలు, ప్రారంభించిన ప్రాజెక్టుల మాట ఎలా ఉన్నా, ఆయన పేల్చి వెళ్లిన బాంబు విస్ఫోటన సృష్టిస్తున్న ప్రకంపనలు మాత్రం పరిపరి విధాలుగా పరిణమిస్తున్నాయి. వీటి అంతిమ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:  Telangana BJP Election Committees : తెలంగాణ ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ