KCR-Modi: మోడీ టూరుకు మళ్లీ డుమ్మా!

ఏడాదిన్నరగా మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు.

  • Written By:
  • Updated On - July 7, 2023 / 03:44 PM IST

ఏడాదిన్నరగా మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఆయనకు బదులుగా జిల్లా మంత్రులు స్వాగతం పలికారు. శనివారం వరంగల్ పర్యటనకు రానున్న సందర్భంగా వెళ్తే ఎలా ఉంటుందని మల్లగుల్లాలు పడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొన్ని రోజులుగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికరి ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ లీడర్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అందులో బీఆర్ఎస్ లీడర్లు బీజేపీపై విమర్శల దాడిని తగ్గించారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానికి స్వాగతం పలికితే రాజకీయాల్లో తలెత్తే పరిణామాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.

మంత్రులు మాత్రమే స్వాగతం

హుజూరాబాద్ బై ఎలక్షన్‌లో ఓటమి తర్వాత గులాబీ లీడర్లు బీజేపీపై ఎటాక్ ప్రారంభించారు. ఏ చిన్న అవకాశం వచ్చినా సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆపార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. చివరికి ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినా ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లలేదు. ఈ ఏడాదిన్నర సమయంలో నాలుగు సార్లు అధికారిక పర్యటన కోసం రాష్ట్రానికి మోడీ వచ్చారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ , ఇండియన్ బిజినెస్ స్కూల్ స్నాతకోత్సవం, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం (నవంబర్ 12, 2022), సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికరణ పనుల ప్రారంభానికి (ఏప్రిల్ 8, 2023) ప్రధాని మోడీ వచ్చారు. ఈ సందర్భాల్లో జిల్లాలకు చెందిన మంత్రులు మాత్రమే మోడీకి స్వాగతం పలికారు.

మళ్లీ దూరం : కేటీఆర్

మోడీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే మోదీ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి మోదీ అని, ఏ మొహం పెట్టుకుని ఆయన తెలంగాణకు వస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు కేటీఆర్

షెడ్యూల్ ఇదే

ఈ నెల 8న మోదీ.. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో వస్తారు. ఉదయం 9.45కి హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కి వస్తారు. 9.50కి హెలికాప్టర్‌లో వరంగల్‌కి బయలుదేరతారు. 10.35కి వరంగల్ చేరతారు. తర్వాత వరుస కార్యక్రమాలు ఉంటాయి. ఈమధ్య బీఆర్ఎస్‌ని బీజేపీ రిష్తేదార్ సమితి అని నేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ బలంగా ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మే అవకాశం కూడా ఉంది. మరి ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఏం మాట్లాడతారు? ప్రచారాలకు ఎలా తెర దించుతారు అనేది చర్చనీయాంశంగా మారనుంది.

Also Read: Hyderabad : బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ పేరు మార్చిన తెలంగాణ ప్ర‌భుత్వం