Indiramma Housing Scheme : ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు విధివిధానాలు, నిబంధనలను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇందిరమ్మ పథకంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందించ నున్నారు. దీంతో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో మరో పథకాన్ని (Indiramma Housing Scheme) అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. శనివారం గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ పై ఆదేశాలను జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే తొలి ప్రాధాన్యత అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలకు దరఖాస్తులను కూడా తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. వీటి ఆధారంగానే మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయల గ్యాస్ సిలెండర్ ఇవ్వటానికి మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో రేషన్ కార్డు లేనివారు ఆందోళన చెందుతున్నారు. తమకు పథకాలు రావేమో అనుకుంటున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని సీఎం హామీ ఇవ్వడం జరిగింది.మరోవైపు రాష్ట్రంలో చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయకపోవటంతో ఎప్పుడెప్పుడు ఇస్తారా అని జనం ఎదురు చూస్తున్నారు.
Also Read : Viswak Sen : లేడీ గెటప్ లో విశ్వక్ సేన్.. ఏ సినిమా కోసమో తెలుసా..?
తాజాగా తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్లపై కీలక విషయాలు చెప్పారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవన శంకుస్థాపనకు వెళ్లిన మంత్రి పొంగులేటి.. అక్కడి సభలో కొత్త రేషన్ కార్డుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో మాట ఇస్తే ఎంత కష్టం అయినా నెరవేరుస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డులను త్వరలోనే ఇస్తామని, ఇందిరమ్మ ఇళ్ల కల సాకారం అవుతుందని పొంగులేటి చెప్పారు. ఎంత కష్టం వచ్చినా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పిన ఆయన.. అర్హులైన వారందరికీ అన్ని పథకాలు వర్తింపు జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. సంక్షేమ పథకాలు పేదలకు అందాలనే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు సీఎం తెలిపారు. దీని వల్ల ఏ పేదవారికి కూడా నష్టం జరగదన్నారు. ప్రస్తుతం దీనిపై కసరత్తులు జరుగుతున్నాయి.