INCOIS Hyderabad : మన హైదరాబాద్‌లోని ‘ఇన్‌కాయిస్’ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) సంస్థ సేవలకు విశిష్ట గుర్తింపు లభించింది. ఇన్‌కాయిస్‌కు ‘సుభాష్ చంద్రబోస్ ఆప్ద ప్రబంధన్ అవార్డు’ను ప్రకటించారు. ఇది జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక పురస్కారం. విపత్తు నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు ఈ పురస్కారానికి ఇన్‌కాయిస్‌ను ఎంపిక చేశారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది వ్యక్తులు, సంస్థల నుంచి దాదాపు 297 నామినేషన్లు వచ్చాయి. వాటన్నింటినీ జల్లెడ పట్టి సంస్థల విభాగంలో ఇన్‌కాయిస్‌కు పురస్కారాన్ని ప్రకటించడం విశేషం.
Also Read :Garlic Price : వెల్లుల్లి కిలో రూ.450.. ధర ఎందుకు పెరిగింది ? ఎప్పుడు తగ్గుతుంది ?
ఏమిటీ INCOIS ?
- ఇన్‌కాయిస్(INCOIS Hyderabad) అంటే ‘ది ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్’.
- ఇన్ కాయిస్ అనేది భారత ప్రభుత్వం పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ.
- కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇన్ కాయిస్ ఉంటుంది.
- హైదరాబాద్‌లోని ప్రగతి నగర్‌లో దీని కార్యాలయం ఉంది.
- 1998 సంవత్సరంలో ఇన్‌కాయిస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ (ESSO)కు అనుబంధంగా ఇన్ కాయిస్ పనిచేస్తుంటుంది.
- సునామీ హెచ్చరికలను ముందస్తుగా జారీ చేయడం, సముద్రంలో వాతావరణంపై అంచనాలు వెలువరించడం, సముద్ర జలాలపై నిఘా ఉంచడం వంటి పనులను ఇన్‌కాయిస్‌లోని నిపుణులు చేస్తుంటారు.
సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్ గురించి..
సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్‌ను భారత ప్రభుత్వం అందిస్తుంటుంది. విపత్తు నిర్వహణ విభాగంలో అంకితభావంతో సేవలు అందించే సంస్థలకు ఈ పురస్కారాలను అందిస్తుంటారు. ఈ అవార్డును ఏటా జనవరి 23న ప్రకటిస్తారు. ఎందుకంటే ఈ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ అవార్డుకు ఎంపికయ్యే సంస్థలకు రూ.51 లక్షల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు, సర్టిఫికెట్‌ను అందజేస్తారు. ఈ అవార్డుకు ఎవరైనా వ్యక్తులు ఎంపికైతే వారికి రూ.5 లక్షల నగదు బహుమతి, సర్టిఫికెట్‌ను అందజేస్తారు.