Rs 500 Gas Cylinder : రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే హామీ ఇంకో రెండు లేదా మూడు వారాల్లో తెలంగాణలో అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. అంటే న్యూ ఇయర్‌లో ప్రతి ఇంటికి ప్రభుత్వ కానుక ఈ స్కీమ్ అమల్లోకి రానుంది. తెలంగాణలో 89.99 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 44 శాతం మంది నెలకోసారి గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేస్తున్నారు. అంటే ప్రతినెలా 52.80 లక్షల మంది గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు. వారందరికీ రూ.500 చొప్పున సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన సంవత్సరానికి ఎన్ని సిలిండర్లను రూ.500 చొప్పున ఇవ్వాలి అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం లెక్క తేల్చింది. దాని ప్రకారం ఖజానాపై రూ.4,450 కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇందుకు అవసరమైన నిధులను ఎలా సేకరించాలి? నెల నెలా ఎలా కేటాయించాలి? అనేవి ప్రభుత్వం ముందున్న సవాళ్లు. ఇప్పుడు వాటిపైనే లోతైన చర్చ జరుగుతోందని సమాచారం. అసలు రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హులు ఎవరు ? నియమ నిబంధనలు ఏమిటి ? అనే వాటిపైనా రేవంత్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఓ ప్రతిపాదన ప్రకారం రేషన్ కార్డు ఉన్న వారిని, రేషన్ కార్డు లేని వారిని కూడా అర్హులుగా ఎంపిక చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలోనూ రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను(Rs 500 Gas Cylinder) అమలు చేశారు. ఈ లెక్కన తెలంగాణలోనూ ఈ స్కీమ్‌ను అమలు చేయడమైతే ఖాయం.