Hyderabad : మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్‌లో అక్రమ సరోగసీ మరియు ఎగ్ ట్రేడింగ్ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి ముఠాను అరెస్ట్ చేశారు. ఇటీవలే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ద్వారా డాక్టర్ నమ్రత మోసం చేసిన ఘటన మరువక ముందే మరో ముఠా బట్టబయలైంది. వైద్యారోగ్య శాఖ మరియు మేడ్చల్ SOT, పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మి రెడ్డి అలియాస్ లక్ష్మి, గతంలో ఎగ్ డోనర్ మరియు సరోగేట్ మదర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి, జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం తల్లి చేపట్టిన అక్రమ IVF, సరోగసీ కేంద్రాన్ని నడిపించడంలో సహకరిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy : వైసీపీ పట్ల ప్రజల నమ్మకం నశించదు.. జగన్ విలువలు కలిగిన వ్యక్తి : సజ్జల
లక్ష్మిరెడ్డి ముఠా, డబ్బు అవసరమైన పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని ఎగ్ డోనర్‌లుగా, సరోగేట్ మదర్లుగా వాడుతున్నారు. మాదాపూర్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని, పిల్లలు లేని జంటల ఆవేదనను డబ్బుగా మార్చేలా ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. చిలకలూరిపేటకు చెందిన లక్ష్మి రెడ్డి, నరేందర్ రెడ్డి హైదరాబాద్‌లోని సుచిత్ర, పద్మా నగర్ ప్రాంతాల్లో నివాసం ఉంటూ, అక్రమంగా ఈ క్లినిక్ నడుపుతున్నారు. వివిధ రాష్ట్రాల నుండి మహిళలను తీసుకొచ్చి, తన ఇంట్లో ఉంచి, IVF పద్ధతిలో గర్భధారణ చేయించేందుకు అవసరమైన మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వైద్యారోగ్య శాఖ ప్రాథమిక విచారణలో హెగ్డే, లక్స్ ఆసుపత్రులతో నిందితురాలు సంబంధాలు పెంచుకుని ఈ రహస్య కార్యకలాపాలు నడిపినట్లు తేలింది.
ఈ దాడిలో పోలీసులు నిందితుల వద్ద నుండి ₹6.47 లక్షల నగదు, లెనోవో ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, సిరంజీలు, గర్భధారణ మందులు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు, ఐదు స్మార్ట్‌ఫోన్లు, ఒక కీప్యాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక, ఈ వ్యవహారానికి సహకరించిన ఇతరుల గుర్తింపుపై దర్యాప్తు కొనసాగుతోంది. లక్ష్మి గతంలో మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులోనూ నిందితురాలిగా ఉన్నట్లు సమాచారం. తాజాగా, సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) యాక్ట్ మరియు భారతీయ శిక్షా స్మృతి (BNS) యాక్ట్‌ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసు విభాగాలు నకిలీ ఫర్టిలిటీ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టి, ఇలాంటి అక్రమ చర్యలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. పిల్లలు లేని దంపతుల నమ్మకాన్ని వాడుకుని డబ్బు కోసం ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మేడ్చల్ పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
Read Also: FASTag annual pass : అమల్లోకి ఫాస్టాగ్ వార్షిక పాస్.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?