CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తే.. కేటీఆర్ ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉండేవారన్నారు. కేటీఆర్, కేసీఆర్‌ను జైల్లో వేయాలని చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు. కానీ, అక్రమ కేసులు పెట్టి వాళ్లను జైలుకు పంపే కక్షపూరిత రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు అని రేవంత్ అన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ.500 జరిమానా విధిస్తారు. కానీ, డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారు. రూ.500 జరిమానా వేసే కేసులో జైలులో పెట్టి వేధించారని సీఎం అన్నారు. నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్‌పై వచ్చి వెళ్లాను. నేను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయదలిస్తే.. ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారు అని సీఎం అన్నారు.
Read Also: Akunuri Murali : అక్బరుద్దీన్ ఒవైసీపై మాజీ ఐఏఎస్ ఆగ్రహం
మేం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.26వేల కోట్లు రుణమాఫీ చేశాం. ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకొని రైతుబంధు కూడా వేయలేదు. బీఆర్‌ఎస్ ఎగవేసిన రైతుబంధు రూ. 7,625 కోట్లు మేం చెల్లించాం. వరి వేస్తే ఉరే అని మాజీ సీఎం స్వయంగా బెదిరించారు. మేం మాత్రం వరి వేసిన వారికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చాం అని రేవంత్ తెలిపారు. బీఆర్‌ఎస్ మొదటి విడత ప్రభుత్వం కేవలం రూ.13 వేల కోట్లు రుణమాఫీ చేసింది. తొలి విడత రుణమాఫీకి ఐదేళ్లు తీసుకున్నారు. రెండోసారి గెలిచాక రుణమాఫీని అసలు పూర్తే చేయలేదు. నాలుగేళ్ల తర్వాత మాత్రం రూ.11 వేల కోట్లు మాఫీ చేశారు. నాలుగేళ్ల తర్వాత రుణమాఫీ చేసినందుకు వాటికి వడ్డీ రూ.8,500 కోట్లకు పైగా అయ్యిందన్నారు.
నేను భూసేకరణను వ్యతిరేకించలేదు. పరిహారం చెల్లించాలని ధర్నాలు చేశాను. కమీషన్ల కోసం ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేశారు. రూ.36వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి.. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం చేపట్టారు. కాళేశ్వరం అవినీతి విషయంలో త్వరలోనే వీళ్లు జైలుకు వెళ్తారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది అని రేవంత్ అన్నారు. ప్రాజెక్టుల కోసం పేదల భూములు తీసుకున్న కేసీఆర్, వాళ్ల బంధువుల భూములు మాత్రం తప్పించారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న రైతులు అందోళన చేయలేదా? అని ప్రశ్నించారు. 14 గ్రామాల ప్రజలను పోలీసులతో కొట్టించి బలవంతంగా భూసేకరణ చేశారన్నారు. ప్రాజెక్టు వద్ద ఎవరికి భూములు, ఫామ్‌హౌజ్‌లు ఉన్నాయో నిజనిర్ధారణ కమిటీ వేద్దామా? కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ కాలువలు తీసినట్లు నిరూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: KTR : కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు : కేటీఆర్