Site icon HashtagU Telugu

HYDRA : చార్మినార్‌ను కూల్చాలని ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా.. హైడ్రా కమిషనర్‌‌కు హైకోర్టు ప్రశ్న

Hydra High Court

HYDRA : హైదరాబాద్ నగరంలో హైడ్రా విభాగం జరుపుతున్న కూల్చివేతలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఇవాళ విచారించింది. ఈ విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ వర్చువల్‌గా హాజరవగా,  అమీన్‌పూర్ తహసీల్దార్ నేరుగా హాజరయ్యారు. ఈసందర్భంగా అమీన్‌పూర్‌ తహసీల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లోగా ఖాళీ చేయాలని నోటీసులిచ్చి..  40 గంటల్లోపే ఎలా కూల్చేస్తారని న్యాయస్థానం సీరియస్ అయింది. తాము అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలంటూ హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు బెంచ్(HYDRA) స్పష్టం చేసింది. చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా అని హైడ్రా కమిషనర్‌ను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ‘‘కేవలం శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాతే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారు ? సెలవు రోజుల్లోనే అందరికీ నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేయడానికి కారణం ఏమిటి ? శని, ఆదివారాల్లో నిర్మాణాలను కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి కదా ?’’ అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం ఎందుకు పని చేయాలి ? ఉన్నతాధికారులను మెప్పించేందుకు ఎవరూ చట్ట విరుద్ధంగా పని చేయొద్దు’’ అని న్యాయస్థానం సూచించింది.

Also Read :Dadasaheb Phalke Award : మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. అక్టోబరు 8న ప్రదానం

‘‘ఇళ్లను కూల్చే ముందు దాని యజమానికి కనీసం  లాస్ట్ ఛాన్స్  ఇచ్చారా ? చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా’’ అని హైకోర్టు బెంచ్ హైడ్రా కమిషనర్‌ను నిలదీసింది. ‘‘పొలిటికల్ బాస్‌లను సంతృప్తి పరిచేందుకు అత్యుత్సాహంతో పని చేయకూడదు. ఇక నుంచి అధికారులు చట్ట వ్యతిరేకంగా పని చేస్తే నేరుగా ఇంటికి వెళ్లాల్సి వస్తుంది’’ అని న్యాయస్థానం హెచ్చరిక చేసింది. జనం ఇళ్లు ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. కోర్టు ఆర్డర్లను కూడా పట్టించుకోలేదంటూ అమీన్‌పూర్‌ తహసీల్దార్‌‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలో అమీన్‌పూర్ కూల్చివేతలపై హైకోర్టు బెంచ్‌కు హైడ్రా కమిషనర్ బదులిస్తూ.. ‘‘ఎమ్మార్వో విజ్ఞప్తి మేరకే మేం చర్యలు తీసుకున్నాం’’ అని చెప్పారు. ఈ సమాధానాన్ని తప్పుపట్టిన హైకోర్టు బెంచ్..  ‘‘ఎమ్మార్వో అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా ? ఎమ్మార్వో చెప్పాడని చార్మినార్, హైకోర్టు కూడా కూల్చేస్తారా’’ అని ప్రశ్నించింది.