Site icon HashtagU Telugu

Asaduddin Owaisi : ‘‘మసీదులు, దర్గాల 1 ఇంచు భూమి కూడా పోనివ్వను’’.. లోక్‌సభలో అసద్ వ్యాఖ్యలు

Asaduddin Owaisi Waqf Bill Mosque Masjid Dargah Pm Modi Government Lok Sabha Aimim

Asaduddin Owaisi : ‘వక్ఫ్ బిల్లు’ను వ్యతిరేకిస్తూ కేంద్రంలోని మోడీ సర్కారుపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. వక్ఫ్ బిల్లును దేశంలోని యావత్ ముస్లిం సమాజం వ్యతిరేకిస్తోందని ఆయన పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లును అమల్లోకి తెస్తే దేశం 1980వ దశకం, 1990వ దశకంలలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేయొద్దని మోడీ సర్కారును ఒవైసీ కోరారు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై లోక్‌సభలో నిర్వహించిన చర్చలో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఈ వ్యాఖ్యలు చేశారు.  దేశంలోని ముస్లిం సమాజం మనోభావాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వక్ఫ్ బిల్లు అమలైతే సమాజంలో అస్థిరత ఏర్పడుతుందన్నారు.

Also Read :Delhi Polls 2025 : ‘ఢిల్లీ’మే సవాల్.. రేపే ఓట్ల పండుగ.. త్రిముఖ పోరులో గెలిచేదెవరు ?

ఇది నా హెచ్చరిక

‘‘జాగ్రత్తగా వ్యవహరించమని నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను.. వక్ఫ్ బిల్లును మీ ఇష్టానుసారంగా ఉన్న ప్రతిపాదనలతో అమల్లోకి తెస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26, 14ల ఉల్లంఘన జరుగుతుంది. దీనివల్ల సమాజంలో అస్థిరత ఏర్పడుతుంది. వక్ఫ్ ఆస్తులను ముస్లింలు ఎవరూ వదలరు. నేను ఒక ఇంచు మసీదు స్థలాన్ని కానీ, దర్గా స్థలాన్ని కానీ వదలను. ఇతరులు దాన్ని తీసుకునేందుకు అనుమతించను’’ అని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.

Also Read :Ratan Tatas Friend : రతన్ టాటా ఫ్రెండ్‌ శంతను నాయుడుకు కీలక పదవి.. ఎవరీ యువతేజం ?

వక్ఫ్ ఆస్తులు ముస్లింల సొత్తు

‘‘నేను భారతీయ ముస్లింగా చెప్పుకునేందుకు గర్విస్తాను. అందుకే మసీదులను, దర్గాలను తప్పకుండా కాపాడుకుంటాను. మీరు వికసిత భారత్‌ను కోరుకుంటున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. కానీ నిరంకుశంగా చట్టాలు చేస్తామంటే కుదరదు’’ అని మజ్లిస్ చీఫ్ పేర్కొన్నారు. ‘‘వక్ఫ్ ఆస్తులు ముస్లింల సొత్తు. ముస్లింల పూర్వీకులు వాటిని దర్గాలు, మసీదులకు ఇచ్చారు. వాటిని ఇతరులు లాగేస్తామంటే మేం ఊరుకోం. వక్ఫ్ అనేది మాకు ఒక ప్రార్థన లాంటిది. ఈ సభలో నేను మా ముస్లిం సమాజం తరఫున మాట్లాడి తీరాలి. అది నా బాధ్యత. ఈ అంశంపై ప్రజాస్వామిక వాతావరణంలో చర్చ జరగాలి’’ అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. తన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను ఒవైసీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా లోక్‌సభలో నిలబడి మాట్లాడానని అందులో ప్రస్తావించారు.