Kadiyam Srihari: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, ఇదే తన చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్‌లో శనివారం షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్యపై పరోక్షంగా సెటైర్లు వేశారు.
“నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. ఇవే నా చివరి ఎన్నికలని అసెంబ్లీ ఎన్నికలకు ముందే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదు” అని కడియం శ్రీహరి అన్నారు. తన దృష్టి మొత్తం నియోజకవర్గ అభివృద్ధిపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. “చిలిపి చేష్టలు లేవు. చిల్లర పనులు చేయను. తప్పు చేయను. తలవంచను” అంటూ ఆయన తన ప్రత్యర్థిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Also Read: Best Foods To Sleep: మంచి నిద్రకు సహాయపడే ఆహారాలు ఇవే!
పరోక్షంగా తాటికొండ రాజయ్యపై విమర్శలు
కడియం శ్రీహరి తన ప్రసంగంలో రాజయ్యపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. “ఎక్కడికైనా వెళ్తే నాటుకోడి కూర, బ్లాక్ లేబుల్ మందు అడగను. మిగిలిన భోజనం టిఫిన్‌లో పెట్టుకొని తీసుకుపోను” అంటూ ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు గతంలో జరిగిన వివాదాలను గుర్తు చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అలాగే రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడాన్ని కడియం శ్రీహరి తప్పుపట్టారు. “మనిషికైతే చెప్పొచ్చు. కానీ పశు లక్షణాలు ఉన్న వ్యక్తికి ఏం చెప్పలేము” అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనుల వివరాలు
నియోజకవర్గ అభివృద్ధి కోసం గత 21 నెలల్లో రూ. 1,025 కోట్ల నిధులు తీసుకొచ్చానని కడియం శ్రీహరి తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో మరో రూ. 2,000 కోట్ల నిధులు తీసుకొచ్చి స్టేషన్ ఘనపూర్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీతో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. కడియం శ్రీహరి వ్యాఖ్యలు స్టేషన్ ఘనపూర్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పిన కడియం, రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు దారితీస్తుందో చూడాలి.
