MLA Gudem Mahipal Reddy: బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై మార్చి 25న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, అసెంబ్లీ సెక్రటరీకి ఎన్నికల సంఘానికి, 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు రిజిస్టార్ ద్వారా జ్యూడిషియల్ నోటీసులు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. మార్చి 22 కల్లా నోటీసులకు స్పందించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
నిన్నటితో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు ఇద్దరు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy), బండ్ల కృష్ణమోహన్ అఫిడవిట్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నోటీసులకు అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదని బీఆర్ఎస్ న్యాయవాదులు తెలిపారు. మార్చి 25, మంగళవారం సుప్రీంకోర్టులో జరిగే విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read: Watermelon Seeds: పుచ్చకాయతో పాటు గింజలు కూడా తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!
అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీతో నాది సుదీర్ఘ అనుబంధమని ఆయన అందులో ప్రస్తావించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాను అనేది తప్పుడు ప్రచారమే అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పొంగిలేటి సమక్షంలో సీఎం రేవంత్ ను కలిసిన మాట వాస్తవేమనని ఆయన పేర్కొన్నారు. అది మర్యాదపూర్వక భేటీనే.. రాజకీయ ఉద్దేశం లేదని వివరించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ విధంగా పేర్కొన్నారు.
గతంలో పదిమంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రెండు వేరు వేరు పిటిషన్‌లను బీఆర్ఎస్ నేతలు దాఖలు చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదని పిటిషన్‌ను కేటీఆర్ కూడా దాఖలు చేశారు.