Saree Run : హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఉన్న పీపుల్స్ ప్లాజా ఒక్కసారిగా రంగులమయంగా మారింది. అక్కడికి ఏకంగా 3,120 మంది మహిళలు వివిధ రంగుల చీరలు ధరించి తరలివచ్చారు. వారంతా మన దేశంలోని విభిన్న చేనేత కళలతో తయారు చేసిన చీరలను ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భాగ్య నగరంలోని ఈ మహిళలంతా వివిధ నేపథ్యాలకు చెందినవారు. కొందరు వ్యాపారులైతే, ఇంకొందరు ఉద్యోగులు. అయినా అందరూ కలిసిమెలిసి రన్ చేశారు. మహిళలకూ ఫిట్‌నెస్ అవసరమని చాటి చెప్పారు. చీరలు ధరించినా, ఫిట్‌నెస్ విషయంలో మహిళలు రాజీపడకూడదు అనే గొప్ప సందేశాన్ని వాళ్లు ‘తనీరా సారీ రన్’(Saree Run) కార్యక్రమం ద్వారా ఇచ్చారు.
Also Read :Final Wish: ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక.. భారత్‌లో ఏం చేశారో తెలుసా ?
సాంస్కృతిక వారసత్వం వర్సెస్ ఆధునిక జీవనశైలి
తనీరా అనేది టాటా గ్రూపునకు చెందిన వస్త్ర బ్రాండ్. జేజే యాక్టివ్ అనేది బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఫిట్‌నెస్ కంపెనీ. ఇవి రెండూ సంయుక్తంగా ‘తనీరా సారీ రన్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో కలర్ ఫుల్‌గా, జోష్ ఫుల్‌గా నిర్వహించాయి. తనీరా సీఈఓ అంబుజ్ నారాయణ్, జేజే యాక్టివ్ నుంచి ఫిట్‌నెస్ కోచ్ ప్రమోద్‌లు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల్లో నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు సాంస్కృతిక వారసత్వం, ఆధునిక జీవనశైలి మధ్య సమతుల్యతను ప్రోత్సహిస్తాయి. మహిళలు తమ దినచర్యలో ఫిట్‌నెస్‌ను ఒక భాగంగా మార్చాలనే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తాయి.
Also Read :Raja Rithvik : తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రిత్విక్‌కు కాంస్యం.. నేపథ్యం ఇదీ..
ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి
‘‘తనీరా సారీ రన్ మహిళల ఆధునిక శక్తిని ప్రదర్శించింది. ఎంతోమంది ఇతర మహిళలకు స్ఫూర్తిని పంచింది. ఫిట్‌నెస్‌కు వారిని దగ్గర చేసింది. మేం కోరుకున్నది కూడా అదే’’ అని తనీరా సీఈఓ అంబుజ్ నారాయణ్ తెలిపారు.
మహిళలూ ఫిట్‌నెస్‌ను విస్మరించొద్దు
‘‘మహిళలు నిత్యం తమ కుటుంబ శ్రేయస్సు గురించే ఆలోచిస్తుంటారు. ఈక్రమంలో సొంత ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారు. అందుకే మహిళలూ ఫిట్‌నెస్‌పై కొంతైనా శ్రద్ధ పెట్టాలి. ఆ విషయాన్ని చాటిచెప్పేందుకు సారీ రన్ నిర్వహించాం’’ అని జేజే యాక్టివ్ కంపెనీకి చెందిన ఫిట్‌నెస్ కోచ్ ప్రమోద్ తెలిపారు.