Khajaguda Lake Misery : హైదరాబాద్ నగర ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు కొత్తగా చెరువుల నిర్మాణం జరగట్లేదు..
కానీ ఉన్న చెరువులు కబ్జాల చెరలో చిక్కి మాయం అవుతున్నాయి..
126 ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక చెరువు ఈవిధంగా కుచించుకుపోతోంది..
చెత్త కుప్పలతో, ప్లాస్టిక్ వ్యర్ధాలతో డంపింగ్ యార్డుగా మారుతోంది..
నగరంలో భారీ వర్షాలకు వరదలు సంభవించకుండా నీటిని నిల్వ చేసుకునే ఆ అతిపెద్ద బఫర్ జోన్ ఖాజాగూడ చెరువు.
ఖాజాగూడ చెరువు.. భగీరథమ్మ చెరువు
ఖాజాగూడ చెరువు (Khajaguda Lake)ను భగీరథమ్మ చెరువు అని కూడా(Khajaguda Lake Misery) పిలుస్తారు.. ఇది ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ కు సెంటర్ పాయింట్లుగా ఉన్న నానక్ రామ్ గూడ, మణికొండ ఏరియాల మధ్యలో ఉంది. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ హయాంలో 1897లో ఖాజాగూడ చెరువును నిర్మించారు. ఇది అప్పట్లో 618 ఎకరాల్లో విస్తరించి ఉండేదని అంటారు. ఖాజాగూడ చెరువు నుంచి కామారెడ్డి, సారంపల్లి, నర్సంపల్లి ప్రాంతాలకు కూడా తాగునీటిని సరఫరా చేసేవారు. దీన్నిబట్టి ఆ చెరువు కెపాసిటీ ఎంతగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. ఈ చెరువులో ఎన్నో రకాల జలచరాలు, వివిధ జాతుల నీటి మొక్కలు కూడా ఉండేవని అంటారు.
నాడు 618 ఎకరాలు.. నేడు 38 ఎకరాలు
కట్ చేస్తే.. ఇప్పుడు ఖాజాగూడ చెరువు కేవలం 38 ఎకరాలలో ఉంది. దీన్నిబట్టి గత 126 ఏళ్ళలో ఈ చెరువు పరిసర ప్రాంతాలు ఎంతగా కబ్జాకు గురయ్యాయో అర్ధం చేసుకోవచ్చు. ఆనాడు 618 ఎకరాలు.. ఈనాడు 38 ఎకరాలు .. మిగితా చెరువు శిఖం భూమి ఏమైంది ? ఎటు పోయింది ? అనేది పెద్ద ప్రశ్న!! గత ఏడేళ్లలో ఖాజాగూడ చెరువు (Khajaguda Lake) విస్తీర్ణం దాదాపు ఒక ఎకరం తగ్గిపోయిందని ప్రభుత్వ రికార్డులను బట్టి తెలుస్తోంది. కనీసం ఇప్పటికైనా ఈ చెరువును కబ్జాల నుంచి కాపాడాలంటే .. దాని చుట్టూ పకడ్బందీగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి.
Also Read: Samantha Treatment: హెల్త్ ట్రీట్ మెంట్ కోసం సమంత ఎన్ని కోట్లు ఖర్చుచేస్తోందో తెలుసా?
రియల్ ఎస్టేట్ బూమ్ గండం..
హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ, మణికొండ ఏరియాల్లో విపరీతమైన రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తోంది. ఈక్రమంలో ఖాజాగూడ చెరువు చుట్టూ కొత్త నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. వాటిలో ఖాజాగూడ చెరువు ఉనికిని దెబ్బతీసే నిర్మాణాలు ఏవైనా ఉంటే.. చెరువును ఆక్రమించే నిర్మాణాలు ఏవైనా ఉంటే నిలువరించాల్సిన బాధ్యత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై ఉంది. ఆక్రమణలను తక్షణమే ఆపకపోతే త్వరలో ఖాజాగూడ చెరువు మరింత శిఖం భూమిని కోల్పోయే ముప్పు ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. నానక్ రామ్ గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ , ఔటర్ రింగ్ రోడ్ లను కలిపే రహదారిని నిర్మిస్తున్నప్పుడు ఖాజాగూడ సరస్సు బాగా దెబ్బతిందని గుర్తు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ వ్యర్ధాలు పడి చెరువు బాగా ఇంకిపోయిందని అంటున్నారు.
చెరువుకు కంచె కంపల్సరీ
ఖాజాగూడ చెరువు ఇప్పుడు ఒక డంపింగ్ యార్డును తలపిస్తోంది. చెరువు పరిసరాలు చెత్తా చెదారం, ఘన వ్యర్థాలతో నిండిపోయి కంపు కొడుతున్నాయి. రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలు వ్యర్థాలను తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఈ చెరువు దగ్గర వేసి వెళ్తున్నారు. చెరువు దగ్గర రోజూ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు అవుతుంటాయి. కనీసం డస్ట్‌బిన్‌లు కూడా లేకపోవడంతో ప్లేట్స్, ఆహార వ్యర్ధాలను చెరువు దగ్గర పడేస్తున్నారు. ఈవిధంగా చెత్త డంపింగ్‌ను అడ్డుకోవడానికి చెరువు చుట్టూ కంచె వేయాల్సిన అవసరం ఉంది.