Hyderabad Kidney Racket : హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఉన్న అలకనంద ఆస్పత్రి కేంద్రంగా నడిచిన కిడ్నీ రాకెట్‌తో ముడిపడిన కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ వ్యవహారానికి కింగ్ పిన్‌గా డాక్టర్ అవినాష్ వ్యవహరించాడని గుర్తించిన రాచకొండ పోలీసులు, అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 15 మందిని నిందితులుగా గుర్తించగా, ఇప్పటివరకు తొమ్మిది మంది అరెస్టయ్యారు. ఈవివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. మిగతా వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. కిడ్నా రాకెట్‌లోని ముఠా సభ్యులు అలకనంద ఆస్పత్రి కేంద్రంగా ఇప్పటి వరకు 20 మందికి కిడ్నీలు మార్పిడి చేశారని సీపీ చెప్పారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ. 60 లక్షలు చొప్పును మొత్తం రూ.12 కోట్ల దాకా వసూలు చేశారని తెలిపారు. కాగా, ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన వ్యక్తులతో ఈ కిడ్నీ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు తేలింది.
Also Read :Meerpet Murder Case : వీడిన మాధవి మర్డర్ మిస్టరీ.. హీటర్‌తో పొటాషియం హైడ్రాక్సైడ్‌లో ఉడికించి మరీ..
సీపీ సుధీర్ బాబు తెలిపిన కీలక వివరాలు..
- డాక్టర్ సుమంత్ సరూర్ నగర్‌లో అలకనంద ఆస్పత్రిని(Hyderabad Kidney Racket) ఏర్పాటు చేశారు.
- సుమంత్ ఉజ్బెకిస్తాన్‌లో ఎంబీబీఎస్ చేశాడు. 2022 సంవత్సరంలో హైదరాబాద్‌లో జననీ హాస్పిటల్‌ను ఆయన నిర్వహించాడు. గత ఆరు నెలలుగా సరూర్ నగర్‌లో అలకనంద ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు.
- 2023 సంవత్సరం నుంచి ఈ ఆస్పత్రి కేంద్రంగా అక్రమంగా కిడ్నీ మార్పిడి దందా మొదలుపెట్టారు.
- ఆర్థికంగా నష్టాల్లో ఉన్న డాక్టర్ అవినాష్.. ఈ కిడ్నీ మార్పిడి దందాకు దిగాడు. ఆయన పలు కిడ్నీ మార్పిడి సర్జరీలు చేశారు. అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినవారిలో ఇతర రాష్ట్రాల డాక్టర్లు కూడా ఉన్నారు.
- డాక్టర్ అవినాష్ జనతా, అరుణ ఆస్పత్రుల్లో గతంలో పనిచేశారు.
- అవినాష్ చైనాలో ఎంబీబీఎస్ చదివి వచ్చారు.
- కిడ్నీ రాకెట్‌లో పవన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడు. అతడు ఒక్కో ఆపరేషన్‌కు రూ.60 లక్షల దాకా వసూలు చేశాడు.
- తమిళనాడుకు చెందిన నస్రీన్ బాను, ఫిర్ధోస్‌లను కిడ్నీ దాతలుగా గుర్తించారు. బెంగళూరుకు చెందిన రాజశేఖర్, ప్రభలను కిడ్నీ గ్రహీతలుగా గుర్తించారు. అలకనంద ఆస్పత్రిని తనిఖీ చేసిన టైంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- అరెస్టయిన వారిలో డాక్టర్ అవినాష్, హాస్పిటల్ యజమాని సుమంత్, రిసెప్షనిస్ట్ గోపి, నిర్వాహకులు ప్రదీప్, సూరజ్, నల్లగొండ జిల్లాకు చెందిన మెడికల్ అసిస్టెంట్లు రవి, రవింధర్, హరీష్ , సాయి ఉన్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు.