Suravaram Pratapareddy: హైదరాబాద్‌లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మారబోతోంది. దీనికి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును పెట్టనున్నారు. ఈమేరకు తెలుగు యూనివర్సిటీ చట్టంలో మార్పులను ప్రతిపాదిస్తూ ఇవాళ ప్రత్యేక బిల్లును అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. వాస్తవానికి దీనిపై 2024 సెప్టెంబరు 20నే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం జరిగింది. తెలుగు వర్సిటీకి సురవరం పేరు పెట్టాలని అప్పట్లోనే డిసైడ్ చేశారు. 1985 డిసెంబరు 2న స్థాపించిన సమయంలో తెలుగు వర్సిటికీ పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల తర్వాత దీనికి పేరును మార్చబోతున్నారు.
Also Read :UNESCO : ప్రపంచ వారసత్వ రేసులో ‘నిలువురాళ్లు’.. ఎలా నిలబడ్డాయి? ఏం చేస్తాయి ?
సురవరం ప్రతాప రెడ్డి జీవిత విశేషాలు
- సురవరం ప్రతాపరెడ్డి(Suravaram Pratapareddy) 1896 మే 28న జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడులో జన్మించారు.
- ఆయన హైదరాబాద్ నిజాం కాలేజీలో ఇంటర్, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బీఏ చదివారు.
- సురవరం మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో లా చేశారు.
- 1916లో సురవరం పెళ్లి చేసుకున్నారు. ఆయనకు 10 మంది సంతానం.
- తెలంగాణలోని 354 కవుల వివరాలతో కూడిన ‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథాన్ని ప్రచురించిన ఘనుడు సురవరం ప్రతాపరెడ్డి.
- 1926లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి లాంటిది. ఇందులోని సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి.
- గోలకొండ పత్రికకు అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారు.
- హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమం ఆయన ఇతర ముఖ్య రచనలు.
- 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు సురవరం అధ్యక్షత వహించారు.
- 1951లో ప్రజావాణి అనే పత్రికను ఆయన ప్రారంభించారు.
- 1952లో వనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
- 1953 ఆగస్టు 25న సురవరం ప్రతాపరెడ్డి కన్నుమూశారు.
- సురవరం రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
- హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించిన మహనీయుల విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా ఉంది.