Site icon HashtagU Telugu

Cyber Fraud : కంపెనీ ఈమెయిల్‌ హ్యాక్.. 10 కోట్లు మాయం

Cyber Fraud

Cyber Fraud

Cyber Fraud : సైబర్ కేటుగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఫేక్ కాల్స్, మెసేజెస్, నకిలీ లింక్స్ పంపిస్తూ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ఈ నేరస్తులు, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి కార్పొరేట్ సంస్థలను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఓ ఘోర సైబర్ మోసం ఇప్పుడు సంచలనంగా మారింది. నగరానికి చెందిన ప్రముఖ కంపెనీని లక్ష్యంగా చేసుకుని, మెయిల్ హ్యాకింగ్ ద్వారా రూ. 10 కోట్ల భారీ మొత్తాన్ని కాజేశారు.

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కంపెనీ హాంకాంగ్‌కు చెందిన ఓ అంతర్జాతీయ సంస్థ నుంచి ముడిసరుకు (raw materials) కొనుగోలు చేస్తోంది. గతంలో జరిగిన లావాదేవీల ప్రకారం, సరుకు రాగానే నగదు చెల్లింపులు చేసే పద్ధతిని ఈ కంపెనీ అనుసరిస్తోంది. అయితే, అన్ని ఆర్థిక లావాదేవీలు మెయిల్ ద్వారానే జరుగుతున్నాయనే విషయం సైబర్ నేరస్తుల దృష్టిలో పడింది. దీంతో, వారంతా ఆ కంపెనీ మెయిల్ అకౌంట్‌ను టార్గెట్ చేశారు.

Drinking Water: ప్రతిరోజు నీరు తాగితే బరువు తగ్గుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

సైబర్ నేరగాళ్లు ముందుగా హైదరాబాద్ కంపెనీ ఇమెయిల్‌ను హ్యాక్ చేశారు. ఆ తర్వాత, హాంకాంగ్ కంపెనీ తరఫున నకిలీ మెయిల్ ఐడీ సృష్టించారు. ఇక, హైదరాబాద్ కంపెనీ తరఫున ముడిసరుకు కోసం హాంకాంగ్ సంస్థకు మెయిల్ వెళ్లిన వెంటనే, నేరస్తులు రంగంలోకి దిగారు. అసలు హాంకాంగ్ కంపెనీ అధికారులకు సమాచారం లేకుండానే, తమ అకౌంట్లో సమస్య ఉందని, నగదును కొత్త బ్యాంక్ అకౌంట్‌లోకి బదిలీ చేయాలంటూ నకిలీ మెయిల్ పంపించారు.

హైదరాబాద్ కంపెనీ కూడా అనుమానించకుండా, నేరస్తుల సూచనల ప్రకారం కొత్త అకౌంటుకు రూ. 10 కోట్లు బదిలీ చేసింది. వారంరోజుల తర్వాత అసలు మోసం బయటపడింది.

హాంకాంగ్ కంపెనీ ఖాతాలో డబ్బులు చేరకపోవడంతో, వారు హైదరాబాద్ కంపెనీకి మెయిల్ పంపారు. దీంతో, ఖంగుతిన్న హైదరాబాద్ సంస్థ అధికారులు, తాము పంపిన అకౌంట్ వివరాలను హాంకాంగ్ కంపెనీకి షేర్ చేశారు. కానీ, అది తమ అకౌంట్ కాదని, తాము ఆ మెయిల్ కూడా పంపలేదని హాంకాంగ్ కంపెనీ అధికారాలు స్పష్టం చేశారు. దీంతో, భారీ మోసానికి గురైనట్లు గ్రహించిన హైదరాబాద్ కంపెనీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరస్తులు ఎక్కడి నుంచి ఈ మోసాన్ని నిర్వర్తించారు? అకౌంట్ ఎక్కడికి చెందినది? ఎలాంటి హ్యాకింగ్ టెక్నిక్ ఉపయోగించారు? అనే కోణంలో విచారణ చేపట్టారు.

ఈ ఘటన మరోసారి కంపెనీలు, వ్యాపార సంస్థలు సైబర్ మోసాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా, ఇమెయిల్ ద్వారా చేసే ఆర్థిక లావాదేవీల్లో ప్రతి మెయిల్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, మారిన బ్యాంక్ వివరాలను మూడుసార్లు ధృవీకరించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే, ఇలాంటి భారీ మోసాలకు బలవ్వాల్సిన పరిస్థితి తప్పదు.

Orange: ఆరెంజ్ తిన్నప్పుడు పొరపాటున కూడా ఈ ఆహారాలు అస్సలు తినకండి.. తిన్నారో!