Hyderabad Blasts Plan: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన సిరాజుర్ రహ్మాన్(29), తెలంగాణలోని సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్(28)లను తెలంగాణ కౌంటర్ ఇంటెలీజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఎందుకు అంటే.. సౌదీ అరేబియాలోని ఐసిస్ మాడ్యూల్ నుంచి లభించిన ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో డమ్మీ పేలుళ్లకు వీరిద్దరూ కుట్ర పన్నారు. ఇందుకోసం సిరాజ్, సమీర్‌లు కలిసి పక్కా ప్లాన్‌ను రెడీ చేసుకున్నారు. విజయనగరంలో పేలుడు పదార్థాలను కొన్నారు. సిరాజ్, సమీర్‌లు బాంబ్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేస్తున్నారనే సమాచారం తెలంగాణ కౌంటర్ ఇంటెలీజెన్స్ టీమ్‌కు అందింది. దీంతో వెంటనే సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. ఈ నిందితుల్లో ఒకరి తండ్రి పోలీసు శాఖలోనే(Hyderabad Blasts Plan) పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు నిందితులను కోర్టు ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు.
సమీర్, సిరాజ్ ఎలా కలిశారు ? సౌదీతో లింక్ ఏమిటి ?
పోలీసుల కథనం ప్రకారం.. సమీర్, సిరాజుర్ రహ్మాన్‌లకు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరూ తరుచుగా ఛాట్ చేసుకునేవారు. క్రమంగా ఇద్దరి స్నేహం బలపడింది. ఒకరిపై ఒకరికి నమ్మకం కుదిరింది. ఐసిస్ ఉగ్రవాద యాక్టివిటీల గురించి సమీర్, సిరాజ్ ఎక్కువగా మాట్లాడుకునే వారు. సౌదీ అరేబియాలో ఉన్న ఒక ఐసిస్ హ్యాండ్లర్‌తో వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. భారత్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడాలని అతడే సమీర్, సిరాజ్‌లకు నూరిపోసే వాడట. అతడి సూచనల మేరకే వీరిద్దరు కలిసి ఆన్‌లైన్‌లో పేలుడు సామగ్రికి ఆర్డర్ ఇచ్చారు. తమ చేతికి అందిన పేలుడు సామగ్రితో విజయనగరంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పేలుడుకు సంబంధించిన ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ఆప్రయోగ పరీక్ష సక్సెస్ అయింది. దీంతో ఈ ఇద్దరూ కలిసి దేశంలోని మరిన్ని చోట్ల పేలుళ్లకు పాల్పడాలని భావించారు. సమీర్, సిరాజ్‌ల టార్గెట్ లిస్టులో హైదరాబాద్ నగరం ఉందా ? లేదా ? అనే దానిపై ఇప్పటివరకైతే పోలీసుల వద్ద పక్కా ఆధారాలు లేవు. ఈ ఇద్దరి ఇళ్లలోనూ పోలీసులు ఇప్పటికే సోదాలు చేశారు.
Also Read :Hyderabad Fire : హైదరాబాద్‌లో గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటన.. ఇలా జరిగింది
సౌదీలోని ఐసిస్ ఉగ్రవాదిపై ఫోకస్
సమీర్, సిరాజ్‌లకు పేలుడు సామగ్రి గురించి ఎలా తెలుసు ? పేలుడు సామగ్రితో బాంబులను తయారు చేయడం ఎవరు నేర్పించారు ? అనే వివరాలను వారి నుంచి రాబట్టడంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. సౌదీ అరేబియా నుంచి వీరిద్దరిని హ్యాండిల్ చేసిన ఐసిస్ ఉగ్రవాది చిట్టాను కూడా బయటికి తీసేందుకు కసరత్తు జరుగుతోంది.