హైదరాబాద్‌లోని హోటళ్లలో ఆహార నాణ్యత ఏ స్థాయిలో ఉందో మరోసారి బయటపడింది. బంజారాహిల్స్‌లోని ‘లక్కీ బిర్యానీ షవర్మ’ ఉదంతం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో ఉన్న ‘లక్కీ బిర్యానీ షవర్మ’ హోటల్ అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వినియోగదారుడు ఆదివారం జొమాటో ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా, అది తీవ్రమైన దుర్వాసనతో కూడి ఉంది. ఆహారం పాడైపోయిందని గ్రహించిన ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హోటల్‌పై ఆకస్మిక దాడి చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ యజమాని ఇర్ఫాన్ కేవలం లాభాపేక్షతో వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
మూడు రోజుల నిల్వ.. ఎలుకల సంచారం!
పోలీసుల తనిఖీల్లో వెల్లడైన విషయాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. జీడిమెట్లలో మూడు రోజుల క్రితమే తయారు చేసిన సుమారు 80 బిర్యానీ ప్యాకెట్లను తీసుకువచ్చి ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ రాగానే వాటిని ఓవెన్‌లో వేడి చేసి, తాజాగా ఉన్నట్లు నమ్మించి కస్టమర్లకు పంపిస్తున్నారు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే, ఆ బిర్యానీ ప్యాకెట్లు ఉంచిన ఫ్రిడ్జ్‌లో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి. హోటల్ కిచెన్ అంతా బొద్దింకలు, చెత్తాచెదారం మరియు దుర్వాసనతో అపరిశుభ్రంగా ఉంది. ఎలుకలు, బొద్దింకలు తిన్న ఆహారాన్నే ప్రజలకు వడ్డిస్తూ హోటల్ యాజమాన్యం బరితెగించింది.
హోటల్ సీజ్.. క్రిమినల్ కేసులు నమోదు
ఈ భయంకరమైన పరిస్థితులను చూసిన పోలీసులు వెంటనే హోటల్‌ను సీజ్ చేశారు. సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఆహార నమూనాలను సేకరించారు. ప్రజల ఆరోగ్యానికి విఘాతం కలిగిస్తున్న యజమాని ఇర్ఫాన్‌పై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ యాప్స్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే వారు, కేవలం రేటింగ్స్ చూసి మోసపోకుండా హోటళ్ల నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి బాధ్యతారహితమైన హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
