CM Revanth Reddy: తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఈ రోజు పండుగ చేసుకుంటున్నారని, ప్రజల ఆశీర్వాదంతో చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని ఆయన తెలిపారు. తెలంగాణ చరిత్ర భూమి చుట్టూ తిరిగిన పోరాటాలు, త్యాగాలపై ఆధారపడిందని, రైతులు, ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు తమ ప్రభుత్వానికి ప్రాధాన్యత అని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “ఆనాడు కేసీఆర్ రైతు బంధు ఎగ్గొట్టారు. కానీ మా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7625 కోట్ల నిధులను విడుదల చేశాం. రూ.2 లక్షల రుణమాఫీతో 25 లక్షల 35 వేల 964 మంది రైతులకు రూ.20,617 కోట్లు ఖాతాల్లో జమ చేసి రుణవిముక్తులను చేశాం” అని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 15, 2024 నాటికి రైతులను రుణవిముక్తులను చేసినట్లు తెలిపారు.
Also Read: Neopolis: రూ. 3169 కోట్లతో నిర్మాణం.. హైదరాబాద్‌లో నియోపోలిస్ భారీ ప్రాజెక్ట్!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి “వరి పండిస్తే ఉరి వేసుకున్నట్లేనని, ప్రభుత్వం వడ్లు కొనదని కేసీఆర్ చెప్పారు. కానీ మేము వరి పండించమని, చివరి గింజ వరకు కొనడమే కాక, మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చాం. రైతుల నమ్మకంతో తెలంగాణ దేశంలోనే అత్యధికంగా 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి మొదటి స్థానంలో నిలిచింది,” అని రేవంత్ గర్వంగా చెప్పారు.
బీఆర్ఎస్ నాయకులైన కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లపై ఘాటు విమర్శలు చేస్తూ “కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేశారు. రైతుల పేరుతో లక్ష కోట్లు కొల్లగొట్టి, వేల కోట్లు సంపాదించారు. మొయినాబాద్, జన్వాడ, గజ్వేల్‌లో ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయి? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చింది?” అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ‘కూలేశ్వరం’గా విమర్శిస్తూ లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులు ఆగిపోయాయని విమర్శించారు. “బీఆర్ఎస్ కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్లు చెల్లించింది, కానీ రైతులకు నీళ్లు ఇవ్వలేదు,” అని ఆయన అన్నారు.
తమ ప్రభుత్వం 18 నెలల్లో రైతుల కోసం రూ.1,04,000 కోట్లు ఖర్చు చేసిందని, 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసినట్లు చెప్పారు. కేసీఆర్‌ను సవాల్ చేస్తూ “గోదావరి జలాలు, బనకచర్ల ప్రాజెక్టుపై శాసనసభలో చర్చకు సిద్ధమా?” అని అడిగారు. రైతులను రాజులుగా చేసి, వ్యవసాయాన్ని పండుగగా మార్చిన చరిత్ర తమదని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను, 18 నెలల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసి చర్చించాలని కోరారు.