తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించిన కీలకమైన హిల్ట్ (HILT – హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్) పాలసీకి సంబంధించిన వివరాలు కసరత్తు దశలోనే బయటకు రావడంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా స్పందించింది. ఈ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, ముఖ్యంగా వేల కోట్ల విలువైన భూములకు సంబంధించిన అంశాలు, అధికారికంగా విడుదల కాకముందే బయటకు రావడంపై అధికారులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాలసీకి సంబంధించిన ‘ఫోటోషాప్ స్లైడ్స్’ ఇప్పటికే నవంబర్ 20వ తేదీనే బయటకు వచ్చాయని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇంత గోప్యంగా ఉండాల్సిన సమాచారం లీక్ కావడం వెనుక ప్రభుత్వంలోని కొందరు అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Telangana Rising – 2047 : ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా ‘తెలంగాణ రైజింగ్’
కీలకమైన పాలసీ లీక్ అయిన మరుసటి రోజే, బీఆర్‌ఎస్ నేత కె. తారక రామారావు (KTR) హిల్ట్ పాలసీపై ప్రెస్‌మీట్ పెట్టడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. అధికారిక ప్రకటన రాకముందే ప్రతిపక్ష నేతకు వివరాలు ఎలా చేరాయనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటన నేపథ్యంలో, ప్రభుత్వంలోని కొందరు సీనియర్ IAS అధికారులకు ముఖ్యమంత్రి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పాలసీ వివరాలు బహిర్గతం కావడం వెనుక ఎవరి ప్రమేయం ఉంది, దీని వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనే విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వంలో ఉన్న కీలకమైన ఫైళ్ల గోప్యతపై సందేహాలను లేవనెత్తింది.
ప్రభుత్వం ఈ లీకేజీ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నవంబర్ 22న హిల్ట్ పాలసీకి సంబంధించిన జీవో (GO) అధికారికంగా విడుదలైనప్పటికీ, లీక్ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. ఈ లీక్ విషయమై ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలో నిఘా వర్గాలు రంగంలోకి దిగి, సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రభుత్వ ఫైళ్లు లేదా కీలక సమాచారం ఎలా బయటకు వెళ్లింది, ఈ లీకేజీ ద్వారా ఏమైనా అక్రమాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ విజిలెన్స్ విచారణ ద్వారా లీక్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.
