Site icon HashtagU Telugu

Hijras : గోదావరి లో హిజ్రాలు కఠిన పూజలు..ఎందుకు చేస్తున్నారో తెలుసా..?

Hijras Poojas

Hijras Poojas

భద్రాచలం గోదావరి (Bhadrachalam Godavari)లో హిజ్రాలు కఠిన పూజలు చేస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఎవరైనా పూజలు, యాగాలు తాము బాగుండాలని , తమ కుటుంబం బాగుండాలని చేస్తుంటారు. కానీ ఇక్కడ హిజ్రాలు మాత్రం భద్రాచలం ప్రజలు బాగుండాలని పూజలు చేస్తుండడం విశేషం.

హిజ్రాలు, లేదా ట్రాన్స్‌జెండర్లు, భారతదేశంలో మరియు ఇతర దేశాల్లో సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నవారు. హిజ్రాలు సంప్రదాయంగా భారతీయ సమాజంలో “మూడవ లింగం” గా పరిగణించబడతారు. వారిని ప్రధానంగా వివాహాల సమయంలో అంగీకారాల కోసం పిలవడం లేదా పూజలు చేయడం వంటి సందర్భాలలో కనిపిస్తారు. కొంత కాలం క్రితం వరకు హిజ్రాలుకు ప్రజల్లో సామాన్యంగా గుర్తింపు ఉండకపోవడం, వారికి ప్రభుత్వ పథకాలు లేకపోవడం వంటి సమస్యలు ఉండేవి. కానీ ప్రస్తుతానికి కొన్ని ప్రభుత్వాలు హిజ్రాల హక్కులను గుర్తించడం ప్రారంభించాయి. కొన్ని రాష్ట్రాలు వారికి ప్రత్యేక పథకాలు, ఉద్యోగ రిజర్వేషన్లు, మరియు ఇతర అవకాశాలు అందిస్తున్నారు. తెలంగాణ లో కూడా వీరి కోసం ప్రత్యేక కేటాయింపు చేస్తున్నారు.

తాజాగా వీరి గొప్ప తనం , మంచి మనసును చాటుకున్నారు. జనం కోసం పూజలు చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. మమ్మల్ని మనుషులుగా చూడకపోయినా మీరు బాగుండాలని, మీరు బాగుంటేనే మేము బాగుంటాం అన్న ఆలోచనలో సమాజం బాగుండాలని పూజలు, జాగారాలు చేస్తుండడం అందర్నీ ఆశ్చర్యంలో పడేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో ఏటా సంభవించే వరదల కారణంగా తీవ్ర నష్టం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భద్రాచలం పట్టణంలోకి సైతం వరద వస్తోంది. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న శ్రీసీతారామచంద్రస్వామి దైవదర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రస్తుతం ఉన్న కరకట్టను పటిష్టం చేయడంతోపాటు మరికొంత దూరం పొడిగించారు. ఈ క్రమంలో గోదావరి కరకట్టను పటిష్ట పరిచి వదరల నుంచి భద్రాది పట్టణ వాసులను రక్షించాలని పట్టణానికి చెందిన కొందరు ట్రాన్స్‌ జెండర్లు గోదావరిలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ పూజ కోసం హిజ్రాలు 24 గంటలపాటు కఠిన ఉపవాస దీక్ష చేశారు. రాత్రంతా జాగారం చేస్తూ .. మంగళవాయిద్యాలతో భద్రాచలం పట్టణంలోని గోదావరి తీరానికి చేరుకున్నారు. ఓ హిజ్రా మాతంగులాగా చేసి ఆకుపచ్చని వస్త్రాలను ధరించి వెండి పాల బిందెతో పాలు తీసుకెళ్లి గోదావరిలో పోసి పూజలు చేసింది. పట్టణ ప్రజల శ్రేయసవ్సు కోసమే తాము ఈ పూజలు నిర్వహించామని తెలిపారు. తమ కోసం హిజ్రాలు పూజలు చేసిన విషయం తెలుసుకుని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : YS Sharmila vs YS Jagan: సామాన్యం అంటూనే కోర్టుకు ఈడ్చేసారు- వైఎస్ షర్మిల