తెలంగాణ రాష్ట్రాన్ని బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ముంచెత్తుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, వరంగల్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లోనూ భారీ వర్ష సూచనలు వెలువడ్డాయి. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
Brixton Crossfire 500 XC: ఈ బైక్‌పై భారీగా డిస్కౌంట్.. ధర ఎంతంటే?
వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 27వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండలో 431.5 మిల్లీ మీటర్ల వర్షం కురవడం గమనార్హం. నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 323.3, మెదక్ జిల్లా సర్దానాలో 305.3, కామారెడ్డి టౌన్ ఐడీఓసీ వద్ద 289.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అనేక మండలాల్లో 200 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో రహదారులు దెబ్బతిని, తక్కువ ప్రాంతాలు మునిగిపోయాయి.
నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షపాతం అత్యధికంగా నమోదైంది. సదాశివనగర్, లింగంపేట, దోమకొండ, రాజ్‌పల్లి, కొండపాక, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో వర్షం తాండవం చేసింది. పల్లెపల్లెలు చెరువులతో నిండిపోయి రైతులు సాంత్వన చెందుతున్నా, వరద ముప్పు పెరుగుతుందనే భయంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమై, సహాయక చర్యలకు సిద్ధంగా ఉంది. ప్రజలు అధికారుల సూచనలు తప్పక పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.