తెలంగాణలో ఎండాకాలం ప్రభావం మొదలైనట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఫిబ్రవరిలో చలిగాలులు కొనసాగాలి కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుని, ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగటి సమయంలో భానుడి భగభగలు, రాత్రివేళలోనూ ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండల ప్రభావం ఇప్పటికే చాలా జిల్లాల్లో కనిపిస్తోంది. సోమవారం ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 36.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, మెదక్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి వేడిగా ఉంటున్నాయి. ఫిబ్రవరి నెలలోనే 34-37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవ్వడం విస్మయానికి గురిచేస్తోంది.
వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల ప్రకారం.. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే 15-20 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పొడి వాతావరణం కారణంగా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అధిక ఎండల వల్ల నీటి శాతం తగ్గే అవకాశం ఉండటంతో, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లోనూ, బయటనూ అధిక వేడిమి కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడం మొదలైంది. జనవరి చివరి వారం నుంచే ఎండలు దంచికొట్టడం మొదలవడంతో, ప్రజలు బయట తిరగడానికి భయపడిపోతున్నారు. ఇంట్లోనూ ఉక్కపోత పెరగడంతో ఫ్యాన్స్, ఏసీలు, కూలర్లు వాడడం మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇప్పుడే ఇంత వేడి ఉంటే, ఏప్రిల్ , మే లలో వేసవిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే ఈ సంవత్సరం వేసవి తక్కువ సమయానికే ప్రారంభమై, అధిక ఉష్ణోగ్రతలతో విరుచుకుపడుతుండటం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది.