Gruha Lakshmi Scheme : తెలంగాణలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకం అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో లబ్ధిదారుల గుర్తింపు సహా ఇతర ప్రక్రియలను నిలిపేయాలని ఆర్డర్ ఇచ్చింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ, ఆర్‌అండ్‌బీ శాఖల కార్యదర్శులు, గృహ నిర్మాణ మండలి ఎండీతోపాటు జిల్లాల కలెక్టర్లకు నోటీసులను ఇష్యూ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను నవంబరు 16కు వాయిదా వేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఏజెన్సీ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకం అమలుకు సంబంధించిన జీవో 25ను సవాలు చేస్తూ ఆదివాసీ సేన హైకోర్టులో పిటిషన్ వేసింది. ‘‘ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా లబ్ధిదారులకు వారి సొంత స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం జీవో 25 తీసుకొచ్చింది. దీని ప్రకారం అర్హులకు రూ.3 లక్షల సాయం అందించనుంది. అయితే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరులకు సైతం ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీనివల్ల గిరిజనుల హక్కుల రక్షణకు భంగం కలుగుతోంది. గ్రామసభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా.. అలా జరగడం లేదు. దీనిపై అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవట్లేదు’’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి ఎదుట ఆదివాసీ సేన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలను విన్న న్యాయమూర్తి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకం (Gruha Lakshmi Scheme) అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
Also Read: Gaganyaan Mission : ఇవాళ ‘గగన్‌యాన్’ టెస్ట్ ఫ్లైట్.. ఏమిటి ? ఎలా ?