Cyberabad Traffic Pulse : హైదరాబాద్ అనగానే మనకు భారీ ట్రాఫిక్ గుర్తుకు వస్తుంది. ఆ ట్రాఫిక్‌తో హైదరాబాద్ వాసులు ప్రతిరోజూ ఒక మినీ యుద్ధమే చేస్తుంటారు. తెల్లవారితే చాలు పెద్దసంఖ్యలో ద్విచక్రవాహనాలు, కార్లతో నగరంలోని రోడ్లన్నీ నిండిపోతుంటాయి. దీంతో పలు మార్గాల్లోని ప్రధాన కూడళ్లను దాటేందుకు వాహనదారులకు చాలా టైం పడుతుంటుంది. ఫలితంగా కార్యాలయాలు, ఇళ్లు, ఇతరత్రా గమ్యస్థానాలకు నగరవాసులు ఆలస్యంగా చేరుతుంటారు. ఈ సమస్య గురించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు బాగా తెలుసు. వారు దీనికి ఒక పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చారు. అదేమిటో తెలుసుకుందాం..
Also Read :AP BJP : టార్గెట్ ఆ ఏడుగురు.. ఏపీలో బీజేపీ బిగ్ స్కెచ్
నమోదు ఇలా..
ట్రాఫిక్ సమస్య నుంచి హైదరాబాద్ నగరవాసులకు(Cyberabad Traffic Pulse) ఊరట కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు ఒక కొత్త పరిష్కార మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. దాని పేరే.. ‘ట్రాఫిక్ పల్స్’. దీన్ని వాడుకునేందుకు మనం ఒక క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఆ క్యూఆర్ కోడ్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్విట్టర్ అకౌంటులో అందుబాటులో ఉంది. హైదరాబాద్ వాహనదారులు దీనిలో నమోదు చేసుకునే ముందు, తాము నిత్యం ప్రయాణించే మార్గాలను ఎంపిక చేసుకోవాలి. ఆయా మార్గాల్లో ఒకవేళ ట్రాఫిక్ సమస్యలు తలెత్తితే, సైబరాబాద్ పోలీసులు ముందే గుర్తించి ఆ సమాచారాన్ని వాహనదారులకు చేరవేరుస్తారు. ‘ట్రాఫిక్ పల్స్’ విధానం ద్వారా సైబరాబాద్ పరిధిలోని ముఖ్యమైన 41 రహదారుల రియల్ టైం ట్రాఫిక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాహనదారులకు అందిస్తారు. ట్రాఫిక్ రద్దీతో ముడిపడిన ఈ వివరాలను మెసేజ్ రూపంలో సెల్‌ఫోన్‌కు పంపిస్తారు. ఆ సమాచారం ఆధారంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేసేలా ప్లాన్ చేసుకోవచ్చు.
Also Read :Rice Consumption : ఆ రాష్ట్రాల ప్రజలు నెలకు కేజీ బియ్యం కూడా తినరట.. తెలుగు స్టేట్స్ ఎక్కడ ?
మెట్రో శుభవార్త
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు మెట్రో శుభవార్త చెప్పింది. నిత్యం రాకపోకలు సాగించే హైదరాబాద్ వాసుల కోసం మెట్రో ఫస్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ వద్ద ఈవీ వాహనాలను అందుబాటులో ఉంచాలని మెట్రో నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వాహనాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇటీవలే ప్రారంభించారు. వందకుపైగా ఈ వాహనాలను పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్ల నుంచి మల్కాజ్ గిరి, సైనిక్ పురి, ఈసీఐఎల్ వంటి ప్రాంతాలకు నడుపుతున్నారు. వీటిని త్వరలోనే హైదరాబాద్‌లోని ఇతర స్టేషన్లకు, ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు.