Site icon HashtagU Telugu

Telangana Debts: తెలంగాణ అప్పులు, ఖర్చులు, ఆర్థిక లోటు.. కొత్త వివరాలివీ

Telangana State Govt Debts Expenses Budget

Telangana Debts: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత 15 నెలల్లో దాదాపు రూ.1.52 లక్షల కోట్లు అప్పు చేసింది. దీని వివరాల్లోకి వెళితే.. 2024 నవంబరు 30 వరకు రూ.1.24 లక్షల కోట్ల అప్పు చేశామని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే శాసన మండలికి లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.  2024 డిసెంబరులో రూ.13,909 కోట్లు, 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి మార్చి 11 వరకు మరో రూ.14,800 కోట్లను రాష్ట్ర సర్కారు అప్పు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలను బట్టి తెలుస్తోంది.  ఇవన్నీ కలుపుకుంటే.. 15 నెలల వ్యవధిలో రూ.1.52 లక్షల కోట్ల అప్పు చేసినట్లయింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అప్పులపైనే ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

Also Read :Suravaram Pratapareddy: తెలుగు వర్సిటీకి ‘సురవరం’ పేరు.. తెలంగాణ వైతాళికుడి జీవిత విశేషాలివీ

బీఆర్ఎస్ పాలనా వైఫల్యంతో.. 

తాము తెస్తున్న అప్పులను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల(Telangana Debts) కిస్తీలు, వడ్డీలను చెల్లించేందుకు.. కాంట్రాక్టర్ల పాత బిల్లులను కట్టేందుకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే పలుమార్లు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2023 డిసెంబరు 7న  గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. అప్పటివరకు బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పుల భారం రూ.6.71 లక్షల కోట్లు అని ప్రకటించింది. ఆనాడు బీఆర్ఎస్ సర్కారు పాలనా వైఫల్యం వల్ల అప్పులు పేరుకుపోయాయి. అందుకే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ సర్కారు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం రుణంగా తెస్తున్న డబ్బులను మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పథకాల అమలు, ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులు, పాత అప్పుల వడ్డీల చెల్లింపులకు వెచ్చిస్తున్నారు.  బీఆర్‌ఎస్‌ కాలం నాటి పాత అప్పు రూ.6,71,757 కోట్లు. గత 15 నెలల్లో కాంగ్రెస్ సర్కారు చేసిన అప్పు రూ.1.52 లక్షల కోట్లు. ఇవన్నీ కలిపితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అప్పు దాదాపు రూ.8,24,575 కోట్లుగా ఉంటుంది.

Also Read :UNESCO : ప్రపంచ వారసత్వ రేసులో ‘నిలువురాళ్లు’.. ఎలా నిలబడ్డాయి? ఏం చేస్తాయి ?

ప్రతినెలా రాష్ట్ర సర్కారు ఖర్చు రూ.22,500 కోట్లు

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా చేస్తున్న ఖర్చు దాదాపు రూ.22,500 కోట్లు.  అయితే సర్కారుకు వస్తున్న ఆదాయం, తెస్తున్న కొత్త అప్పులు కలిపినా రూ.18 వేల కోట్లు దాటడం లేదు.  ఈ లెక్కన ప్రతి నెలా దాదాపు రూ.4,500 కోట్ల దాకా ఆర్థిక లోటును తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎదుర్కొంటోంది. దీన్ని పూడ్చుకునేందుకే భూములను తనఖా పెట్టడం, కార్పొరేషన్లకు గ్యారెంటీలు ఇచ్చి రుణాలు తీసుకోవడం వంటివన్నీ చేస్తున్నారు. అదనపు అప్పు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం  అభ్యర్థిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలను పునర్‌ వ్యవస్థీకరించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ సర్కారు కోరుతోంది. 2023 డిసెంబరు 7 నుంచి 2024 నవంబరు 30 వరకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రూ.52,118 కోట్లను రాష్ట్ర సర్కారు అప్పుగా తీసుకుంది. ఈ వ్యవధిలో రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు మరో రూ.61,991 కోట్ల దాకా ఉన్నాయి. గత మూడు నెలల్లో తెలంగాణ సర్కారు చేసిన అప్పుల విషయానికి వస్తే.. టీజీఐఐసీ ద్వారా భూమిని తనఖా పెట్టి రూ.10 వేల కోట్లు తీసుకున్నారు. తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ద్వారా రూ.1000 కోట్లు అప్పు చేశారు.