తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి కొత్త అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ హెలీ టూరిజం సేవలకు శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ నుండి పవిత్రక్షేత్రం శ్రీశైలం వరకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ నాటికి ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ నగరం నుండి నల్లమల అడవులపైగా సుమారు ఒక గంట పాటు సాగనున్న ఈ హెలీ ట్రిప్ ద్వారా భక్తులు శ్రీశైలం దేవస్థానాన్ని చూడటమే కాకుండా మధ్యలోని ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించగలరు.
Glow Skin: ఒక్కరోజులోనే మెరిసిపోయే గ్లోయింగ్ స్కిన్ కావాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
పర్యాటక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ హెలీ టూరిజం సేవ ద్వారా భక్తులు, పర్యాటకులు సమయాన్ని గణనీయంగా ఆదా చేసుకోగలరు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుండి శ్రీశైలం చేరుకోవడానికి 5 నుంచి 6 గంటలు పడుతుంటే, హెలికాప్టర్ సౌకర్యంతో అదే ప్రయాణం కేవలం ఒక గంటలో పూర్తవుతుంది. ఈ సర్వీస్ విజయవంతమైతే, భవిష్యత్తులో రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలకు కూడా హెలీ టూరిజం విస్తరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల పర్యాటకులకు సౌకర్యం పెరగడం మాత్రమే కాకుండా, ఆ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సేవలను సులభంగా పొందేందుకు ప్రత్యేక బుకింగ్ యాప్ మరియు వెబ్‌సైట్ రూపొందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. టికెట్ ధరలు, ప్రయాణ సమయాలు, ప్యాకేజీల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు సులభంగా సీట్లు రిజర్వ్ చేసుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు ఉపయోగపడనున్నాయి. హెలీ టూరిజం ద్వారా తెలంగాణ పర్యాటక రంగం కొత్త దిశగా అడుగులు వేయనుందని, ఇది దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నల్లమల అడవుల మధ్యనుండి, ఎత్తు నుండి ప్రకృతి సోయగాలను చూడగలగడం పర్యాటకులకు మరపురాని అనుభవంగా మారనుంది.
