Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు..

తెలంగాణలో ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు వరుణుడి పలకరింపులతో రాష్ట్రవ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా.. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ అయింది. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల గమనం, స్థానిక వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ […]

Published By: HashtagU Telugu Desk
Heavy rains in Telangana...

Heavy rains in Telangana...

తెలంగాణలో ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు వరుణుడి పలకరింపులతో రాష్ట్రవ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా.. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ అయింది. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల గమనం, స్థానిక వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఒక బలమైన ద్రోణి కొనసాగుతోందని చెప్పారు. దీనికి తోడు రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందన్నారు. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ఉమ్మడి ప్రభావం వల్ల బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమతో కూడిన గాలులు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయన్నారు. దీనివల్ల నేడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

అయితే, ఇదే సమయంలో రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత, వడగాలుల ప్రభావం కూడా కొనసాగుతుందని హెచ్చరించారు. నేడు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆదివారం రాష్ట్రంలోని 10 జిల్లాల పరిధిలో గల 102 మండలాల్లో తీవ్రమైన వడగాలులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 33 మండలాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారి తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో అత్యధికంగా 7.4 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అలాగే జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో 6.7 సెం.మీ, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండలో 6.1 సెం.మీ, వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్యూముంతల్‌లో 5.4 సెం.మీ వర్షం కురిసింది. వీటితో పాటు సంగారెడ్డి జిల్లా ఝరాసంఘంలో 5.1 సెం.మీ, నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపూర్‌లో 5 సెం.మీ చొప్పున వర్షపాతం రికార్డయింది. రాబోయే ఆరు రోజులు వాతావరణం అస్థిరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలను పాటించడం అవసరమని అధికారులు చెబుతున్నారు.

 

  Last Updated: 22 Jun 2026, 09:28 AM IST