Heavy Rain: తెలంగాణలో భారీగా వర్షం (Heavy Rain) కురుస్తోంది. ఉదయం నుంచి వాతావరణ మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వాన మొదలైంది. ఈ వర్షంతో హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సికింద్రాబాద్, మాదాపూర్, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో వర్షం గంటపాటు దంచికొట్టింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం మొదలుకావటంతోనే హైదరాబాద్‌లోని ఉద్యోగులు బస్సులను కాకుండా మెట్రో రైళ్లను ఆశ్రయించారు. దీంతో మెట్రోలో విపరీతమైన రద్దీ నెలకొంది. వీకెండ్ కావటంతో సరదాగా గడుపుదామని వచ్చిన ఐటీ ఉద్యోగులకు వర్షం తీవ్ర నిరాశనే మిగిల్చింది.
వర్షం కారణంగా ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ జామ్‌లతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా కూడలిలో రోడ్లు, లేన్‌లు జలమయం కావడంతో ట్రాఫిక్ సజావుగా సాగడంలేదు. నగరంలోని చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజల కష్టాలను ఉపయోగించుకుని క్యాబ్ అగ్రిగేటర్లు ఛార్జీలను భారీగా పెంచారు. మెట్రో రైళ్లకు ప్రయాణికుల రద్దీ ఏర్పడింది.
Also Read: Free Bus Scheme: ఉచిత బస్సు పథకాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
అయితే హైదరాబాద్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం పేర్కొంది. గురువారం కూడా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో మే 23 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అల్పపీడనం మే 24 నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది.
We’re now on WhatsApp : Click to Join
అయితే.. గురువారం మధ్యాహ్నం రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షం హైదరాబాద్‌ను స్తంభింపజేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) ప్రకారం నల్గొండ జిల్లాలో 102.8, నాగర్‌కర్నూల్‌లో 101, హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో 90.3, షేక్‌పేటలో 87.5, అంబర్‌పేట్‌లో 85.3, నాంపల్లిలో 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.