Site icon HashtagU Telugu

Harish Rao Review: ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం!

Harishrao review corona

Harishrao

కరోనా (Corona) పట్ల ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కోవిడ్ వాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, బూస్టర్ డోసు వేసుకోవాలని సూచించారు. చైనా సహా పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి, కోవిడ్ సన్నద్ధతపై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నత స్థాయి సమీక్ష (Review) జూమ్ ద్వారా నిర్వహించారు.

వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, టీవీవిపి కమిషనర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ బి.ఎఫ్ 7 వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆరోగ్య శాఖ కోవిడ్ సన్నద్ధత పై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు సర్వం సంసిద్ధంగా ఉందని ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురి కావద్దని ఈ సందర్భంగా మంత్రి (Harish Rao) విజ్ఞప్తి చేశారు.

ముఖ్య మంత్రి (CM KCR) దిశా నిర్ధేశంతో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కరోనా ను విజయవంతంగా ఎదుర్కొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలచిందన్నారు. కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి (Harish Rao) ఆదేశించారు. మానవ వనరులు , మందులు , ఆక్సిజన్ , ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలని, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు.

Also Read: CM KCR: కైకాలకు సీఎం కేసీఆర్ నివాళి