Site icon HashtagU Telugu

Harish Rao : ఆ జిల్లాల్లో బస్తీ దవాఖానాల పరిస్థితి దుర్భరంగా ఉంది

Harish Rao

Harish Rao

Harish Rao : మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ మూతపడిన దుస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో బస్తీ దవాఖానాల పరిస్థితి దుర్భరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో హరీష్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పల్లె, బస్తీ దవాఖానాలు ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ దవాఖానలు మూతబడుతున్న పరిస్థితి బాధాకరమని విమర్శించారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన బస్తీ దవాఖానలు ఇప్పుడు నిర్లక్ష్యం వలన సర్వనాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం సైతం తెలంగాణ బస్తీ దవాఖానల సేవలను ప్రశంసించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని మసకబారుస్తోందని అన్నారు.

Valentines Day History : పిల్లలు పుట్టని భార్యలను తోలు ఊడేలా కొట్టే అమానుష పండుగ

టీ డయాగ్నోస్టిక్ సెంటర్ల ద్వారా 134 రకాల ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించిందని హరీష్ రావు గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ హయాంలో పల్లె, బస్తీ దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు సరిగ్గా పనిచేయక ప్రజాదరణ కోల్పోతున్నాయన్నారు. 14 నెలలు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖ సమీక్షలు నిర్వహించకపోవడం, వైద్య సిబ్బంది సమయపాలన లేకపోవడం వల్ల పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక భారానికి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాల్సిన బస్తీ దవాఖానలు మధ్యాహ్నం వరకే మూతపడుతున్నాయనీ, సిబ్బంది సమయానికి రాకపోవడం వల్ల రోగులు నిరాశతో తిరిగి వెళుతున్నారనీ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒక్కసారి మాత్రమే వైద్యులు రావడం వల్ల ఓపీ సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఆదివారాల్లో సేవలు అందించాల్సిన బస్తీ దవాఖానలు తాళం వేసి ఉండడం దారుణమని విమర్శించారు.

ల్యాబ్ టెక్నీషియన్లు లేకపోవడం, సర్వర్ సమస్యలు ఉండటం వలన ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోతున్నాయని, ముఖ్యమైన మందులైన బీపీ, డయాబెటిస్, థైరాయిడ్ మందులు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సిబ్బంది కొరత, వేతనాలు సకాలంలో రాకపోవడం వలన వైద్య సిబ్బంది అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు విమర్శించారు.

Dalai Lama Z-Category Security: దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత.. కార‌ణ‌మిదే?