Site icon HashtagU Telugu

Hyderabad HCL Center: హైదరాబాద్‌లో హెచ్​సీఎల్ కొత్త టెక్ సెంటర్.. 5 వేల మందికి ఉద్యోగాలు?

Hyderabad HCL Center

Hyderabad HCL Center

Hyderabad HCL Center: ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్​సీఎల్ హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్‌ (Hyderabad HCL Center)ను ప్రారంభించనుంది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, హెచ్​సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్‌తో చర్చలు జరిపారు. హెచ్​సీఎల్ కొత్త సెంటర్​లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యమిస్తుంది. అత్యాధునిక క్లౌడ్, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్‌లను అందిస్తుంది.

హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్​సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్‌ అందుకుంది. దీంతో దాదాపు 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, ఐటీలో ప్రతిభా వంతులైన నిపుణులతో ఇప్పటికే హెచ్​సీఎల్ గ్లోబల్ నెట్​ వర్క్​ సెంటర్​ గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కొత్త సెంటర్ మరింత అత్యాధునిక సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తుందని హెచ్​సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ అభిప్రాయపడ్డారు.

Also Read: JEE Main 2025 Exam: ప్రారంభమైన జేఈఈ మెయిన్‌ పరీక్షలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది

రాష్ట్రంలో హెచ్​సీఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో కొత్త సెంటర్‌ను ప్రారంభించాలని ఆహ్వానించారు. స్థానిక యువతకు ఉద్యోగాలతో పాటు హైదరాబాద్‌లోని టెక్నాలజీ, ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని హెచ్​సీఎల్ టెక్ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు. 2007 నుంచే హెచ్​సీఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలను అందిస్తోంది. కొత్త కేంద్రంతో హైదరాబాద్ లో హెచ్​సీఎల్ మొత్తం అయిదు సెంటర్లను విస్తరించనుంది.