జగిత్యాలలో నేడు జరగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు మాజీ మంత్రి హరీశ్ రావు దూరం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావు, కేసీఆర్ పాల్గొనే కీలక సభకు గైర్హాజరు కావడానికి గల కారణాలు ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జగిత్యాలలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ఆ పార్టీ కీలక నేత హరీశ్ రావు హాజరు కావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు ఇప్పుడు తారాస్థాయికి చేరడమే ఇందుకు ప్రధాన కారణం. కాళేశ్వరం ప్రాజెక్టుపై నమోదైన కేసులో హైకోర్టులో తుది విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపేందుకు మరియు న్యాయ సలహాలు పొందేందుకు ఆయన అత్యవసరంగా ఢిల్లీ పయనమయ్యారు. పార్టీ సభ కంటే న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడటమే ప్రస్తుతానికి ప్రాధాన్యత అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
రాజకీయ వర్గాల్లో చర్చ
కేసీఆర్ పాల్గొనే ఏ సభకైనా హరీశ్ రావు ముందుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తుంటారు. అయితే, జగిత్యాల వంటి కీలక ప్రాంతంలో సభ జరుగుతున్న సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై దూకుడు పెంచిన తరుణంలో, హరీశ్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక లోతైన వ్యూహం ఉందని భావిస్తున్నారు. కేసీఆర్ సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, సభలో నాయకులు లేకపోయినా క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగానే ఉందని శ్రేణులకు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు.
న్యాయ పోరాటంపై బీఆర్ఎస్ దృష్టి
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం కావడంతో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది. కేవలం రాజకీయ వేదికలపైనే కాకుండా, న్యాయస్థానాల్లో కూడా సమర్థవంతంగా వాదనలు వినిపించాలని పార్టీ నిర్ణయించుకుంది. అందుకే హరీశ్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. జగిత్యాల సభలో కేసీఆర్ తన ప్రసంగం ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారనే దానితో పాటు, హరీశ్ రావు గైర్హాజరును రాజకీయ ప్రత్యర్థులు ఏ విధంగా అస్త్రంగా మార్చుకుంటారో వేచి చూడాలి.
