Site icon HashtagU Telugu

New Medical Colleges : కేసీఆర్ కల సాకారమైంది – హరీశ్ రావు

Harish rao Happy for 4 new medical colleges

Harish rao Happy for 4 new medical colleges

Harish Rao Happy for 4 New Medical Colleges : కేసీఆర్ (KCR) మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు (New Medical Colleges) కేంద్రం నుంచి అనుమతులు రావడం సంతోషకరమని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందని, దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. తాజాగా కేంద్రం తెలంగాణా కు నాల్గు కొత్త మెడికల్ కాలేజీలు ప్రకటించింది. ఏపీకి రెండు కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుమతి ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఈ మేరకు పర్మిషన్లు మంజూరు చేసింది. దీంతో తెలంగాణలో మెదక్, యాదాద్రి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు అనుమతి లభించింది. ఒక్కో కాలేజీలో 50 సీట్లు కేటాయించింది. దీంతో కొత్తగా 200 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదే ఏడాది తెలంగాణలోని నాలుగు మెడికల్ కాలేజీలు ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రకటన తో కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ సంతోషం వ్యక్తం చేస్తుంది.

ఈ సందర్బంగా హరీష్ రావు స్పందిస్తూ..కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ విషయమని, యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ సహా గత నెలలో మెడికల్ కాలేజీల అనుమతి పొందిన ములుగు, నర్సంపేట, గద్వాల్, నారాయణపేట్ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తాజా అనుమతులతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం గత కేసీఆర్ ప్రభుత్వం నిధులు, భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 8 కాలేజీలకు గాను కేవలం నాలుగు మెడికల్ కాలేజీలకు మాత్రమే గత నెల ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు లభించాయని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090 సీట్లకు చేరిందని హరీశ్‌రావు తెలిపారు. అంటే తొమ్మిదేళ్ల కాలంలో 5 రెట్లు పెంచిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి ఏటా పదివేల మందికి పైగా డాక్టర్లను తయారుచేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. MBBS సీట్లలో లక్ష జనాభాకు 22 సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని అన్నారు.

Read Also : Spirituality: కిచెన్ లో పూజ గది ఉందా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!