Site icon HashtagU Telugu

Limca Book of Records: “లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్” లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

“green India Challenge” In “limca Book Of Records”

“green India Challenge” In “limca Book Of Records”

Limca Book of Records : ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల అపార కృషిని నిక్షిప్తం చేసే “లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్” లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు చోటు లభించింది. విద్యా, సాహిత్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, సినిమా, వ్యాపారం, రక్షణ, సామాజిక సేవ వంటి రంగాల్లో అనితరసాధ్యమైన భారతీయుల కృషిని, విజయాలను గుర్తించి.. “లిమ్కాబుక్” రికార్డులో చోటు కల్పిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ అవార్డును సామాజిక సేవా విభాగంలో “ఒక గంటలో అత్యధిక మొక్కలు నాటించే” బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు రికార్డ్స్ లో చోటు కల్పించినట్లు లిమ్కాబుక్ రికార్డ్స్ ఎడిటర్ వత్సాల కౌల్ బెనర్జీ తెలిపారు. లిమ్కాబుక్ ప్రశంస పత్రాన్ని ఇవ్వాల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా జోగినిపల్లి సంతోష్ కుమార్ కు అందించినట్లు వారు తెలిపారు.

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, దుర్గా నగర్ లో 2021 జూలై 4వ తేదిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” (Limca Book of Records) సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక చొరవతో ఒక గంట సమయంలో 16,900 వందల మంది భాగస్వామ్యంతో 3,54,900 మొక్కలు నాటినట్లు సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు ఈ విభాగంలో ఇదే అత్యుత్తమని.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు 21 మొక్కలు నాటినట్లు సంస్థ వివరించింది. సమిష్టి కృషి, సామాజిక స్పృకు ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని ప్రశంసించింది.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు చోటు లభించడం, ముఖ్యమంత్రిగారి చేతులమీదగా రికార్డు ప్రతిని అందుకోవడం మరింత బాధ్యతను పెంచిందన్నారు. “లిమ్కాబక్”లో చోటు దక్కడానికి ప్రధాన కారణం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న గారు. వారు కేసిఆర్ గారి స్పూర్తితో తన బర్త్ డే సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా భారీగా మొక్కలు నాటాలనే సంకల్పం తీసుకొని.. విశేష కృషి చేసి ఒక గంటలోనే మూడున్నర లక్షలు మొక్కలు నాటించారు. రామన్నగారు, వారి అనుచరుల కృషి మాటల్లో వర్ణించలేనిది. నెల రోజుల పాటు విశేష కృషి చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం మూలంగానే ఇవ్వాల ఈ రికార్డు సాధ్యమైంది. వారికి, వారి అనుచర బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

అంతేకాదు.. ఈ రికార్డ్ ను ఎమ్మెల్యే జోగురామన్నగారికి, ఈ నేల పచ్చగా ఉండాలని అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ప్రకృతి ప్రేమికులు సాలుమారద తిమ్మక్క, వనజీవి రామయ్య, జాదవ్ పయాంగ్ తో పాటు.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా కోట్ల మొక్కలు నాటిని ప్రతీ ఒక్కరికి అంకితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రారంభం నుంచి మొక్కలు నాటిన ప్రతీ కార్యక్రమం తెలిసేలా సంస్థ ప్రతినిధులు వీడియోను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రతినిధి సంజీవ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Also Read:  Cheruku Sudhakar: హైకోర్టు కు చేరిన చెరుకు సుధాకర్ పంచాయతీ..!

Exit mobile version