తెలంగాణ రాష్ట్ర యువతకు ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ హన్మకొండలో ఘనంగా ప్రారంభమైంది. దేశ సేవలో భాగమవ్వాలని కలలుకనే వేలాది యువకులకు ఈ ర్యాలీ ఆశాకిరణంగా మారింది. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జెండా ఊపి ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని ఆర్మీ చెన్నై జోన్, సికింద్రాబాద్ రిక్రూట్మెంట్ ఆఫీసు సమన్వయంతో నిర్వహిస్తున్నారు. నవంబర్ 22 వరకు కొనసాగే ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు ఎనిమిది వేల మంది యువకులు పాల్గొననున్నారు. ప్రతి రోజు రెండు నుంచి మూడు జిల్లాలకు చెందిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.
Jubilee Hills By Election : నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తో గెలవబోతున్నారు – ఉత్తమ్
ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే ఫిజికల్ టెస్టులు ప్రారంభమవుతాయి. రన్నింగ్, లాంగ్ జంప్, చెస్ట్ మేజర్‌మెంట్, జిగ్‌జాగ్ రన్, చిన్‌అప్స్ వంటి పరీక్షలతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ మరియు మెడికల్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు సుమారు 800 మందికి ఈ పరీక్షలు జరుగుతుండగా, మొత్తం రిక్రూట్మెంట్ కాలంలో దాదాపు 7956 మంది యువకులు మెడికల్ టెస్టులకు హాజరుకానున్నారు. టెస్టులకు ముందు ప్రతి అభ్యర్థి సర్టిఫికేట్లు పూర్తిగా పరిశీలించి, అర్హులైన వారినే మైదానంలోకి అనుమతిస్తున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.
అగ్నివీర్ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏ వ్యక్తి లేదా సంస్థ ద్వారా ఉద్యోగం పొందవచ్చని ఎవరైనా చెబితే నమ్మవద్దని యువతకు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి మోసపూరిత చర్యలు గమనిస్తే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. రిక్రూట్మెంట్ ప్రాంగణం భద్రత కోసం దాదాపు 200 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు మాత్రమే గ్రౌండ్‌లోకి ప్రవేశించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వేలాది మంది తెలంగాణ యువతకు ఆర్మీలో సేవ చేసే అవకాశం లభించనుంది, ఇది రాష్ట్ర గర్వకారణంగా నిలుస్తోంది.
