Site icon HashtagU Telugu

Hookah Centers : హుక్కా కేంద్రాలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Govt Ban On Hookah Centers

Govt Ban On Hookah Centers

డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విషయంలో రేవంత్ సర్కార్ (Congress Govt) సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కువగా యువత డ్రగ్స్ బారిన పడుతుండడం తో రాష్ట్రంలో డ్రగ్స్ అనేవి లేకుండా చేయాలనీ సీఎం రేవంత్ కఠిన చర్యలు చేపడుతూ వస్తున్నారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మాదకద్రవ్యాల నిరోధక విభాగం-టీఎస్‌న్యాబ్‌కు పూర్తిస్థాయి సంచాలకుడిని నియమించారు. దీంతో పోలీసుశాఖ మత్తు పదార్థాల కట్టడిపై కార్యాచరణను ప్రారంభించింది. ఇందులో భాగంగా పబ్​లు, బార్​లు, హుక్కా కేంద్రాలపై ఫోకస్ పెట్టింది.

తాజాగా హుక్కా కేంద్రాలపై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఈ నెల 4వ తేదీన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకోగా.. నిన్న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడే యువతలో ఎక్కువ మంది హుక్కా కేంద్రాలకు వెళ్తున్నట్లు గుర్తించామని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఎక్కువగా హుక్కా కేంద్రాలు నడుస్తున్నాయి. దాదాపు 500 లకు పైనే నడుస్తున్నాయని పోలీసు అధికారులు అంచనా వేశారు. ఇవికాకుండా పబ్​లు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఇళ్లల్లో గుట్టుగా కొనసాగేవి భారీగానే ఉన్నట్లు గుర్తించారు. ఈ కేంద్రాల్లో మద్యం పొగాకు ఉత్పత్తులతో పాటు వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసుల తనిఖీలతో తరచూ వెల్లడవుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

నిబంధనల ప్రకారం హుక్కా పార్లర్ (Hookah Centers) అనుమతి సమయంలో పేర్కొన్న నిర్దిష్ట గదుల్లోనే నిర్వహించాలి. పొగాకు ఉత్పత్తులు ఉపయోగించడానికి వీల్లేదు. మైనర్లను అనుమతించకూడదు. నిర్ణీత సమయాలు పాటించాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్​లోని మెజార్టీ హుక్కా కేంద్రాల్లో నిబంధనలు ఏవీ పాటించడం లేదు. మైనర్లను అనుమతించడంతో పాటు విదేశీ సిగరెట్లు అమ్మేస్తున్నారు. కాఫీ క్లబ్బులు, రెస్టారెంట్లు, హోటళ్ల పైభాగంలో కొన్ని నడుస్తున్నాయి. పోలీసులు తనిఖీలకు వెళ్లినప్పుడు కోర్టు ఆర్డర్ ఉందంటూ సాకులు చెప్పడం, రాజకీయ, ఇతర పలుకుబడితో సర్దిచెప్పడం లాంటివి కొనసాగుతున్నాయి. అసాంఘిక కార్యాకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో గత కొన్నాళ్లుగా దృష్టిసారించిన పోలీసు అధికారులు వీటిపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హుక్కా కేంద్రాలపై నిషేధం విధించింది.

Read Also : Lakshmi Devi: లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపించాలంటే ఈ చిన్న పనులు చేయాల్సిందే?