Kavitha : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీజీఐఐసీకి 1.75 లక్షల ఎకరాలను మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి కోసం అందుబాటులో ఉంచారు. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ భూమిని కుదువ పెట్టి అప్పులు తెచ్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్యంగా జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) జారీ చేసినట్టు పేర్కొన్నారు. దీనివల్ల భూములను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో పెట్టి నిధులు సేకరించే ప్రణాళిక స్పష్టమవుతోందని ఆరోపించారు.
Read Also: Virat Kohli : విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టెస్టులకు గుడ్‌బై
‘‘1.75 లక్షల ఎకరాల భూమి భద్రతపై ఎవరి బాధ్యత? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్పుపై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు? నిపుణుల సిఫార్సులు లేకుండా జీవో జారీ చేయడాన్ని తక్షణం ఉపసంహరించాలి’’ అని డిమాండ్ చేశారు. కంచ గచ్చిబౌలి భూములను కుదువ పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారని, ఇది ప్రజాధనం దుర్వినియోగానికి ఉదాహరణ అని విమర్శించారు. రెవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, అందులో రూ.80 వేల కోట్లు మాత్రమే అప్పుల వడ్డీల కోసం ఉపయోగించారని, మిగతా రూ.లక్ష కోట్లు ఎక్కడికి పోయాయని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తాను పార్టీ బలోపేతం కోసం పని చేస్తోన్న విషయాన్ని స్పష్టం చేసిన కవిత, 47 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. పార్టీలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అది తగదని హెచ్చరించారు. ‘‘నన్ను రెచ్చగొడితే గట్టిగానే స్పందిస్తాను. నా పట్ల దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా,’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Read Also: Shashi Tharoor : మిస్రీ చేసిన కృషి ప్రశంసనీయం..ట్రోలింగ్స్‌ను ఖండించిన శశిథరూర్