Electricity Charges : కరెంటు ఛార్జీల పెంపుపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఛార్జీలను పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనలకు నో చెప్పింది. కరెంటు ఛార్జీల(Electricity Charges) పెంపు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1200 కోట్ల ఆదాయాన్ని పెంచుకుంటామని డిస్కంలు ప్రతిపాదించగా రాష్ట్ర సర్కారు నో చెప్పింది. అందులో రూ.1170 కోట్లు తామే భరిస్తామని తెలిపింది. ఇంటి కనెక్షన్ల (ఎల్‌టీ-1ఎ)లో ఒక నెలలో ఒక్క యూనిట్ కూడా వాడుకోకపోయినా, కనీస ఛార్జీ కింద వసూలు చేస్తున్న రూ.30ని రద్దు చేస్తున్నట్లు సర్కారు వెల్లడించింది. సామాన్య గృహ వినియోగదారులు ప్రతినెలా వాడే విద్యుత్ 300 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్ ఛార్జీని ప్రస్తుతమున్న రూ.10 నుంచి 50కి పెంచాలనే ప్రపోజల్‌కు కూడా రాష్ట్ర సర్కారు నో చెప్పింది. అయితే ప్రతినెలా 800 యూనిట్లకుపైగా కరెంటును వినియోగించే గృహ వినియోగదారులకు సంబంధించిన నెలవారీ ఫిక్స్‌డ్ ఛార్జీని రూ.10 నుంచి 50కి పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read :Jagdish Uikey : విమానాలకు బాంబు బెదిరింపుల వెనుక జగదీశ్ ఉయికే.. ఎవరు ?
ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కరెంటును వినియోగించుకునే పరిశ్రమల వారికి ‘ఆఫ్ పీక్ లోడు’ కేటగిరీ కింద యూనిట్‌కు ప్రస్తుతం రూపాయి ఛార్జీని తగ్గిస్తున్నారు. నవంబరు నుంచి వారికి ప్రతీ యూనిట్‌కు రూపాయిన్నర మేర తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అధునాతన యంత్రాలను వాడుకునే చేనేత, కాటేజ్ పరిశ్రమలకు కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గించేందుకుగానూ కరెంటు కనెక్షన్ కనీస లోడు సామర్థ్యాన్ని 10 నుంచి 25 హెచ్‌పీకి పెంచారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్లకు నెలవారీ ఫిక్స్‌డ్ ఛార్జీ కింద ప్రస్తుతం కిలోవాట్‌కు రూ.50 వసూలు చేస్తుండగా, దాన్ని రద్దు చేస్తూ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో పెద్దఎత్తున ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.