Site icon HashtagU Telugu

Telangana Doctors : ఆ డాక్టర్లకు డబుల్ శాలరీలు.. త్వరలోనే కీలక ప్రకటన !

Treatment At Home

Treatment At Home

Telangana Doctors : తెలంగాణలోని ఆదివాసీ, గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న వైద్యులకు త్వరలోనే రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ వినిపించనుంది. వారి శాలరీలను డబుల్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా ఏరియాల్లో వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లను రూరల్, ట్రైబల్ కేటగిరీలుగా మార్పు చేసి.. వారందరికీ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని భావిస్తోంది.  దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో ఒడిశా రాష్ట్రంలో అచ్చం ఇదే తరహాలో అమలవుతున్న ఇన్సెంటివ్ స్కీమ్‌పై అధికారులు అధ్యయనం చేశారు. డీఎంఈ డాక్టర్ వాణి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్‌లతో కూడిన టీమ్ ఒడిశాలో పర్యటించి ఈ స్కీం అమలుకు సంబంధించిన విధివిధానాల వివరాలన్నీ సేకరించింది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సిఫారసు మేరకు  సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఈ  కొత్త స్కీం అమల్లోకి వస్తుందని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join

ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ప్రతి 50 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించే వైద్యులకు ఒక్కో రకమైన ఇన్సెంటివ్స్ స్లాబ్‌ను నిర్ణయించారు. రాజధాని నగరం నుంచి ఆస్పత్రికి ఎంత  దూరం పెరిగితే అంత మేర ఇన్సెంటివ్ పెరుగుతూపోతుంది. ఆ విధంగా బేసిక్‌ పేపై కనిష్ఠంగా 25 శాతం ఇన్సెంటివ్, గరిష్ఠంగా 150 శాతం ఇన్సెంటివ్స్ అందిస్తున్నారు. తెలంగాణలో ఆ విధంగా కాకుండా ట్రైబల్, రూరల్ ఏరియాలలోని ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులకు  ఇన్సెంటివ్ స్లాబ్‌లను అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి పనిచేస్తే డబుల్ పేమెంట్(వంద శాతం ఇన్సెంటివ్), ట్రైబల్ ఏరియాల్లో పనిచేస్తే  125  శాతం ఇన్సెంటివ్ ఇస్తారని అంటున్నారు. మెడికల్ కాలేజీలు, జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తూ స్పెషాలిటీ సేవలు అందించే డాక్టర్లందరికీ ఈ ఇన్సెంటివ్ స్కీమ్‌ను వర్తింపజేయనున్నట్టు చెబుతున్నారు. డాక్టర్లకు ఈవిధంగా ఇన్సెంటివ్‌ ఇవ్వడానికి దాదాపు రూ.200 కోట్లను  అదనంగా ప్రభుత్వం ఖర్చు చేయబోతోందని అంచనా. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయని తెలిసింది.

Also Read :Financial Uncertainty : రాబోయే ఐదేళ్ల ఫైనాన్షియల్ ప్లానింగ్.. సర్వేలో హైదరాబాదీలు ఏం చెప్పారంటే..

ఈ స్కీం అమల్లోకి వస్తే భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్, ములుగు, భూపాల్‌పల్లి, నాగర్‌‌కర్నూల్ వంటి ఏజెన్సీ, మారుమూల జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేసేందుకు డాక్టర్లు(Telangana Doctors) పెద్దసంఖ్యలో ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ స్కీమ్‌ అమలుతో జిల్లాల్లోనే స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుతాయని, తద్వారా హైదరాబాద్‌లోని గాంధీ ఉస్మానియా వంటి దవాఖానాల్లో పేషెంట్ లోడ్ తగ్గుతుందని భావిస్తున్నారు. పేషెంట్లకు ఖర్చులు కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.