Minister Sridhar Babu: మహిళలకు గుడ్ న్యూస్.. తులం బంగారం హామీ అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

Tulam Banganaram  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుపై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టతనిచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి హామీలను నెరవేర్చామని, త్వరలోనే కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం పథకాన్ని కూడా అమలు చేస్తామని అన్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం ఐక్యంగా ఉందని, ఐదేళ్లలో అన్ని వాగ్దానాలను నెరవేర్చి ప్రజల ముందుకు […]

Published By: HashtagU Telugu Desk
Tulam Banganaram Telangana

Tulam Banganaram Telangana

Tulam Banganaram  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుపై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టతనిచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి హామీలను నెరవేర్చామని, త్వరలోనే కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం పథకాన్ని కూడా అమలు చేస్తామని అన్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం ఐక్యంగా ఉందని, ఐదేళ్లలో అన్ని వాగ్దానాలను నెరవేర్చి ప్రజల ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించగా ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పలు గ్యారంటీలను అమలు చేసింది. అందులో ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మీ ఫ్రీ బస్ జర్నీ, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ వంటివి ఉన్నాయి. అయితే ఈ ఆరు గ్యారంటీల్లో ఒకటైన కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ప్రతిసారి తులం బంగారం హామీపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రధానమైన హామీలు అమలు చేయకుండా మొండి చేయి చూపిస్తోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవల బండి సంజయ్ సైతం సీఎం రేవంత్ రెడ్డికి ఆరు గ్యారంటీల అమలుపై సవాల్ విసిరారు.

ఈ నేపథ్యంలో హామీల అమలుపై తాజాగా ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో మెజార్టీ హామీలు అమలవుతున్నాయని చెప్పారు. మిగతావి కూడా త్వరలోనే అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేయబోతున్నామన్నారు. తులం బంగారం హామీ కూడా త్వరలోనే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపు హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఆ తర్వాతే ప్రజల వద్దకు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు.

తమ ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలు లేవని అన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావాలనే ఆ నంబర్ చెప్పి ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్‍కు ప్రజలను ఏ రకంగా పక్కదారి పట్టించాలనే జిమ్మిక్కు బాగా తెలుసునని అన్నారు. తాము చాలా ప్రాక్టికల్‌గా ఉంటూ ప్రజలకు ఆచరణ యోగ్యమైన హామీలు, పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కొంచెం ఆలస్యం అయినా ప్రజలకు ఇచ్చిన అన్నీ హామీలు వంద శాతం నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్ మంత్రులకు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. సీఎం కెప్టెన్‍గా ముందుకు వెళ్తున్నారని, కేబినెట్ మంత్రులంతా ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నామని చెప్పారు. పీసీసీ రేస్‍లో శ్రీధర్ బాబు ఉన్నారని జరుగుతున్న ప్రచారంపైనా స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. తాము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అది తట్టుకోలేక ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇది సరైంది కాదని శ్రీధర్ బాబు హితవు పలికారు.

 

  Last Updated: 06 Apr 2026, 03:20 PM IST