అమెరికాలో 43 రోజుల పాటు కొనసాగిన సుదీర్ఘ షట్‌డౌన్‌కు ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలకడంతో, దేశ ఆర్థిక గణాంకాల విడుదల వాయిదా పడింది. ఈ అనిశ్చితి వాతావరణంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై పెట్టుబడిదారుల్లో మరింత సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటి వరకు డిసెంబరులో 25 బేసిస్ పాయింట్ల రేట్ల తగ్గింపు ఖాయం అన్న అంచనాలు ఉండగా, తాజా పరిణామాలతో అది వాయిదా పడే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఫెడ్ అధికారులు హాకిష్ వ్యాఖ్యలు చేయడం కూడా రేట్ల కోత త్వరలో ఉండదనే అభిప్రాయాన్ని బలపరిచింది. ఈ ఒక్క పరిణామం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలను గట్టిగా కుదించింది.
Vaisshnav Tej: మనం మూవీ దర్శకుడితో మెగా హీరో?!
ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలతో గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు దేశీయంగా మరియు గ్లోబల్‌గా భారీ ఎత్తున పెరిగాయి. పెట్టుబడిదారులు ఈ అంచనాలకనుగుణంగా పెద్ద మొత్తంలో బంగారంలో పెట్టుబడులు పెట్టగా, ఇప్పుడు ఫెడ్ రేట్ల కోత వాయిదాపడే సూచనలతో ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు. ఫలితంగా ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1450 తగ్గి రూ.1,16,450కి చేరగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములు రూ.1580 పతనంతో రూ.1,27,040 వద్దకు చేరింది. వెండి ధరలు మాత్రం పెద్దగా మార్పు లేకుండా స్వల్పంగా పెరిగి కిలోకు రూ.1,83,100గా ట్రేడయ్యాయి.
అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు మరింత ప్రభావితమైంది. ఒక దశలో ఔన్సుకు 4200 డాలర్లపై ట్రేడవుతున్న బంగారం, ఇంట్రాడేలో 150 డాలర్లకు పైగా పడిపోయి చివరకు 4085 డాలర్ల వద్ద స్థిరపడింది. వెండిరేటు కూడా 53 డాలర్ల స్థాయి నుంచి 50.60 డాలర్లకు పడిపోయింది. రూపాయి విలువ కూడా డాలరుతో పోలిస్తే కొద్దిగా మెరుగై 88.70 వద్ద నిలిచింది. ఫెడ్ నిర్ణయం స్పష్టత వచ్చే వరకు బంగారం, వెండి మార్కెట్లలో ఇలాంటి అస్థిరత కొనసాగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
