Golconda : హైదరాబాద్ నగర చరిత్రను ప్రతిబింబించే రెండు ప్రధాన పర్యాటక కేంద్రాలు గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్. ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసి, పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతి కలిగించేందుకు రోప్‌వే ఏర్పాటు చేయాలని హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ప్రాథమిక ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. హెచ్‌ఎండీఏ అనుబంధ సంస్థ అయిన హుమ్టా (Hyderabad Urban Mass Transit Authority) ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది.
ప్రతీ రోజు సుమారు 10,000 మందికి పైగా పర్యాటకులు గోల్కొండ కోట , కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సందర్శిస్తున్నారు. వీరిలో దాదాపు 3,000 మంది విదేశీయులే కావడం విశేషం. అయితే, ప్రస్తుతం ఉన్న రోడ్డుమార్గం నిండిన ట్రాఫిక్‌తో ప్రయాణానికి కనీసం అరగంట సమయం పడుతోంది. ఈ క్రమంలో, పర్యాటకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రోప్‌వే ఏర్పాటు చేయడం ద్వారా 10 నిమిషాల్లోనే రాకపోకలు జరగే అవకాశం ఉంటుంది.
రోప్‌వే ద్వారా గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు ప్రయాణించడం పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగించనుంది. కేబుల్ కార్లలో ఆకాశంలో ప్రయాణించాలన్న అనుభవం వారిని మరింత ఆకర్షించే అవకాశముంది. ఇది రాకపోకలు వేగవంతం చేయడమే కాదు, హైదరాబాద్ టూరిజానికి కొత్త ఒరవడి తీసుకురానుంది.
PM Kisan : రైతులకు శుభవార్త.. రేపు పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల
ఈ రోప్‌వే నిర్మాణాన్ని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) మోడల్లో చేపట్టనున్నారు. దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.100 కోట్ల వ్యయం అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మొదటగా సాంకేతిక , ఆర్థిక సాధ్యాసాధ్యతలపై పూర్తిస్థాయిలో అధ్యయనం అవసరం. ఇందుకోసం త్వరలోనే కన్సల్టెన్సీని నియమించనున్నారు. బిడ్‌లు కోరుతూ త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
ప్రాథమిక అంచనాల ప్రకారం రోజుకు కనీసం 3,000 మంది రోప్‌వే ప్రయాణం చేసేందుకు అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా సదుపాయాలను పెంచే దిశగా చర్యలు చేపడతామని హెచ్‌ఎండీఏ వర్గాలు వెల్లడించాయి.
గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధుల మధ్య రోప్‌వే ప్రాజెక్టు అమలవుతే, ఇది నగర పర్యాటక రంగానికి మణిహారంగా నిలవనుంది. చారిత్రక పరంగా ఎంతో ప్రాధాన్యమున్న ఈ ప్రాంతాలను అత్యాధునిక రీతిలో అనుసంధానించడం ద్వారా, నగరం అంతర్జాతీయ టూరిజం రంగంలో మరింత గుర్తింపు పొందే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Anil Ambani : రూ.17వేల కోట్ల బ్యాంక్ రుణ మోసాలపై అనిల్ అంబానీకి ఈడీ సమన్లు