Warangal Chapata : వరంగల్ చపాటా మిర్చి.. చాలా స్పెషల్. అది లావుగా, ఎరుపు రంగులో ఉంటుంది. టమాటా ఆకారంలో ఉండటంతో దీన్ని టమాటా మిరపకాయ అని కూడా పిలుస్తారు. తక్కువ ఘాటుతో రుచికరంగా ఉండే ఈ మిర్చికి అరుదైన గుర్తింపు లభించింది. దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ లభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ధ్రువపత్రాన్ని జారీ చేసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలు చపాటా మిర్చికి GI ట్యాగ్ కోసం 2022లోనే చెన్నైలోని ఇండియన్ పేటెంట్ సంస్థకు దరఖాస్తు చేశారు.ఎట్టకేలకు దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తమకు జీఐ ట్యాగ్ రిజిస్ట్రీ నుంచి సర్టిఫికెట్ అందిందని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్ పొందిన 18వ ఉత్పత్తిగా చపాటా మిర్చి రికార్డును సొంతం చేసుకుంది. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా వరంగల్ చపాటా మిర్చికి గిరాకీ పెరిగే అవకాశం ఉంది.
Also Read :India vs Pak War: భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం వస్తే.. ఎవరు గెలుస్తారు ?
ధర ఎంత ? ఈ మిర్చిలో ఏమున్నాయి ?
రెండేళ్ల కిందట వరంగల్ చపాటా మిర్చి(Warangal Chapata) క్వింటా ధర రూ.లక్ష దాకా పలికింది. ఈ మిర్చి ధర ప్రస్తుతం కిలోకు రూ.300 దాకా ఉంది. జీఐ ట్యాగ్ వల్ల దీని ధర కిలోకు రూ.450 నుంచి రూ.500 వరకు చేరనుంది. చైనా, యూకే, యూఎస్, జర్మనీతో పాటు ఇరత యూరోపియన్ దేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ మిర్చి పొడిని పచ్చళ్లలో ఎక్కువగా వాడుతారు. మిఠాయిలు, ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాలు, పానీయాలు, ఔషధాలు, వస్త్ర పరిశ్రమల్లో సైతం ఈ మిర్చిని రంగు కోసం వాడుతారు.మిరప నుంచి తీసే నూనెను ఒలియోరెసిన్ అంటారు. వరంగల్ చపాటా మిర్చిలో ఒలియోరెసిన్ 6.37 శాతం నుంచి 6.75 శాతం వరకు ఉంటుంది.
Also Read :Paritala Sunitha: నా భర్త హత్యలో జగన్ పాత్ర ఉంది.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
సాగు విస్తీర్ణం వివరాలివీ..
ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నడికూడ మండలంలోనే ఎక్కువగా చపాటా మిర్చి సాగయ్యేది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఇది సాగు అవుతోంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట రైతు ఉత్పత్తిదారుల సంఘం చొరవతో ఈ చపాటా మిర్చికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ప్రస్తుతం హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో దాదాపు 20 వేల మంది రైతులు చపాటా మిర్చిని 6,738 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.