Site icon HashtagU Telugu

GHMC: నగరంలో శుభ్రతను మెరుగుపరిచేందుకు జీహెచ్ఎంసీ కీలక చర్యలు!

GHMC

GHMC

GHMC: హైద‌రాబాద్‌.. గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని. హైద‌రాబాద్ అంటే ఎన్నో సంస్థ‌ల‌కు, ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు నిద‌ర్శ‌నం. హైద‌రాబాద్‌లో నిత్యం ర‌ద్దీ ఉంటునే ఉంటుంది. రోజు వేల‌ల్లో జ‌నం వ‌స్తుంటారు. అయితే భాగ్య‌న‌గ‌రం క్లీన్‌గా ఉండటం కోసం వేల మంది జీహెచ్ఎంసీ (GHMC) వ‌ర్క‌ర్లు ప‌ని చేస్తున్నారు. ఇందుకు సీఎం రేవంత్ నాయ‌క‌త్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు చేప‌డుతోంది.

పారిశుధ్య నిర్వహణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో శుభ్రతను మెరుగుపరిచే దిశగా పలు కీలక చర్యలు చేపట్టిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పారిశుధ్య కార్మికులకు రిక్షాలు, వీల్ బారోల్/ పుష్ కార్ట్‌ల‌ను పంపిణీ చేసింది.

Also Read: CM Revanth Highlights: సీఎం రేవంత్ పెద్ద‌ప‌ల్లి స్పీచ్ హైలైట్స్ ఇవే.. కేసీఆర్‌పై సెటైర్లు!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగర పరిశుభ్రతను మరింత మెరుగు పరిచేందుకు 1500 చెత్త రిక్షాలు (ట్రై సైకిళ్లు) కొనుగోలు చేసి ప్రతి సర్కిల్‌కు 50 చొప్పున అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా 1500 వీల్ బారోల్/ పుష్ కార్ట్‌లు కొనుగోలు చేసి ప్రతి సర్కిల్ కు 50 వీల్ బారోల్/ పుష్ కార్ట్ లను అందుబాటులో ఉంచామని తెలిపారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ వద్ద చెత్తను పారవేయకుండా ఊడ్చిన చెత్తను నిల్వ చేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వడానికి ఇట్టి త్రిచక్ర చెత్త రిక్షాలు, వీల్ బారోల్ లు పారిశుధ్య కార్మికుల గ్రూపులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వీధుల్లో ఊడ్చే ప్రదేశాల్లో చెత్త సేకరణకు ఈ రిక్షాలు ఉపయోగించడం జరుగుతుందని, జి.వి.పిల తొలగింపులో ఈ రిక్షాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ ను మరింత మెరుగుపరుస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ భార్గవ్ నారాయణ, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.