గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5లక్షల మట్టి వినాయక విగ్రహాలను జీహెచ్ఎంసీ పంపిణీ చేయనుంది. ఈ రోజు నుంచి 5 లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ద్వారా మరో యాభైకి పైగా ప్రదేశాలలో మట్టి విగ్రహాలను అందుబాటులో ఉంచనున్నట్లు ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.సెప్టెంబరు 18న జరగనున్న గణేష్ చతుర్థి పండుగకు పర్యావరణ అనుకూల విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. అన్ని GHMC సర్కిళ్లలో భక్తులు మట్టి విగ్రహాలను ఉచితంగా తీసుకోవచ్చు . పీఓపీ విగ్రహాలను నీటి వనరులలో నిమజ్జనం చేయడం వల్ల నగరం, శివార్లలో నీటి నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నందున, రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. 2022లో GHMC, HMDA, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) నగరంలో సుమారు ఆరు లక్షల మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేసింది. ఇటు నిమజ్జన ప్రదేశాలను అధికారులు సందర్శించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు రాజేంద్రనగర్‌లోని పత్తికూట చెరువును సందర్శించి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహాల నిమజ్జనానికి అనువుగా ఉండేలా లైటింగ్, కంచె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత కోసం రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
GHMC : గ్రేట్రర్ హైదరాబాద్‌లో 5లక్షల మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధమైన జీహెచ్ఎంసీ

Clayganesh