GHMC : ఇకపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. పౌర సేవల డిజిటలీకరణ దిశగా ఒక బలమైన అడుగు వేసిన జీహెచ్ఎంసీ, “ఒక నగరం.. ఒక వెబ్‌సైట్.. ఒక మొబైల్ యాప్” అనే నినాదంతో కొత్త డిజిటల్ వేదికను రూపొందిస్తోంది. త్వరలో ప్రారంభించనున్న ఈ వేదిక ద్వారా నగర పౌరులు తమ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటి నుంచే అనేక సేవలను పొందగలుగుతారు. ఇప్పటివరకు పౌరులు ఆస్తి పన్ను చెల్లింపులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అనవసరంగా సమయం, శ్రమ వృథా చేసేవారు. ఇకపై ఆ అవసరం లేదు. జీహెచ్ఎంసీ కొత్త వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వగలుగుతారు. లాగిన్ చేసిన తర్వాత ఆ నంబర్‌కు అనుసంధానమైన వారి ఆస్తి పన్ను వివరాలు, ఇంటి నిర్మాణ అనుమతులు, జనన ధ్రువీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్స్‌లు, పెంపుడు జంతువుల లైసెన్స్‌లు, గుత్తేదారుల కాంట్రాక్ట్ డిపాజిట్లు, క్రీడా సభ్యత్వాలు వంటి అనేక సేవల సమాచారం తేలికగా కనిపిస్తుంది. వీటిని అవసరమైనప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Read Also: Israel War : 21 నెలలుగా యుద్ధం.. 60 వేల మంది మృతి
ఈ డిజిటల్ వేదికలోని ప్రత్యేకతల్లో ఒకటి ఫిర్యాదు వ్యవస్థ. ఇప్పటి వరకు ‘మై జీహెచ్ఎంసీ’ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని ప్రజలు తెలిసినా, అందులో పలు సాంకేతిక లోపాలు, పరిమితులు ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. వాటిని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు మరింత సమగ్రంగా పనిచేసే కొత్త ఫిర్యాదు వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇందులో ఫిర్యాదులు నమోదు చేయడమే కాకుండా, వాటి పరిష్కార స్థితిని కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్జన్ మాట్లాడుతూ..ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలు ప్రజలకు తగిన మద్దతు ఇవ్వలేకపోతున్నాయి. అందువల్ల పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచేలా కొత్త డిజిటల్ వేదికను రూపొందిస్తున్నాం.అని చెప్పారు. ఈ వ్యవస్థ రూపకల్పన బాధ్యతను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) కు అప్పగించారు. కమిషనర్ కర్జన్ ఆదేశాల మేరకు, వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయిన వెంటనే వారికి సంబంధించిన అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, రసీదులు ఒకే చోట కనిపించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు.
ఇంతకుముందు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి పన్ను దరఖాస్తులు ఇప్పటికే డిజిటలీకరించబడ్డాయి. వీటికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల విధానం కూడా జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అయితే, తాజా డిజిటల్ వేదిక ఈ సేవలను మరింత విస్తృతంగా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అందించనుంది. అంతేకాదు, జీహెచ్ఎంసీ కొత్తగా ఏర్పాటు చేయనున్న సమీకృత కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజల ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయనుంది. ఈ కంట్రోల్ రూమ్‌ను ఐటి వ్యవస్థలతో అనుసంధానించి, ప్రజల నుంచి వచ్చే సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు. ఈ విధంగా, నగర పాలనలో పారదర్శకతను, వేగాన్ని తీసుకురావడమే కాక, ప్రజలకు కార్యాలయాల ముట్టడి నుంచి విముక్తిని కలిగించాలన్నది జీహెచ్ఎంసీ లక్ష్యం. నూతన డిజిటల్ వేదిక ప్రారంభం అవ్వడం ద్వారా హైదరాబాద్ నగరం స్మార్ట్‌గవర్నెన్స్ దిశగా మరొక కీలక అడుగు వేసిందని చెప్పొచ్చు.
Read Also:Living Room Makeover : ఇంట్లో ఉండే లివింగ్ రూమ్‌కు లగ్జరీ లుక్ ఎలా ఇవ్వాలి? ఈ చిట్కాలు పాటించండి!